సర్ఫింగ్ స్వామీజీ బెంగళూరు : కాషాయధారులై సాధువులు ఒక చేతిలో మంత్రదండంతో, మరో చేతిలో కమండలంతో, దేవతాపీఠాలతో, మందీ మార్బలంతో కనిపించడం మనకు సుపరిచితం. వేకువజామునే యోగా, దేవతాప్రార్థన, హోమాలు, తదితర ఆథ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఆశ్రమాలలో కనిపిచడం మనకు తెలుసు. కానీ దేశంలో సర్ఫింగ్ స్వామీజీ ఒకే ఒక్కరు ఉన్నారు. అమెరికాలో జన్మించి ఇక్కడ ఉంటున్న 64 ఏళ్ళ స్వామీజీ ఉదయాన్నే సముద్రంలో 'సర్ఫింగ్' చేస్తారు. ఆయనతో పాటు శిష్యులైన కొందరు యువ సాధువులు కూడా సర్ఫింగ్ చేస్తారు. వీరందరి సర్ఫింగ్ బోట్లపై ఓంకారం రాసి ఉంటుంది. భారతదేశంలో 7500 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ సర్ఫింగ్ స్వామీజీ ఒక్క కర్ణాటకలోనే కన్పిస్తారు.
అమెరికాలో జన్మించిన జాక్ హెబ్నర్ అలియాస్ నరసింగస్వామి సర్ఫింగ్ ఆశ్రమాన్ని నడపడంతో పాటు ప్రార్థనలు, భజనలూ, పూజలు నిర్వహిస్తారు. ఫ్లోరిడాలో జన్మించిన ఈయన 1963లో సర్ఫింగ్ ప్రారంభించారు. ఆ సమయంలోనే ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద భోదనలకు ఆకర్షితులై శిష్యునిగా చేరి, అప్పటి నుంచి నరసింగస్వామిగా మారారు. తన గురువైన ప్రభుపాదులు సిద్ధి పొందిన తర్వాత మైసూర్ సమీపంలో 1994లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. మంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో గల ముల్కీ వద్ద శాంభవీ నది అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. ఇక్కడే మంత్ర సర్ఫ్ క్లబ్ భావన ఉదయించింది. నాలుగేళ్ళ క్రితం తమిళనాడులోని మహాబలిపురం వద్ద కూడా కొంతమంది యువకులకు స్వామిజీ సర్ఫింగ్ శిక్షణ ఇచ్చారు.
ఈ సర్ఫింగ్ స్వామీజీలు వేకువజామున 4 గంటలకు లేచి ప్రార్థనలు ప్రారంభిస్తారు. అనంతరం సర్ఫింగ్ చేస్తారు. ఇక్కడి మత్య్సకారుల పిల్లలను కూడా ఈ సర్ఫింగ్ ఆకట్టుకుంది. కానీ స్వామీజీ క్రికెటరో, సినిమాతారో కానందువల్ల దేశంలో ఆయన సర్ఫింగ్ ఎవరినీ పెద్దగా ఆకర్షించలేదు. అందుకని 'నేనేమీ క్రికెటర్ సచిన్ కాను, అలాగనీ బాలీవుడ్ సినిమా తారనీ కాను' అని స్వామీజీ చెబుతుంటారు. కానీ సర్ఫింగ్ క్రీడలో యువకులకు శిక్షణ ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరతారు. ఈ శిక్షణ వల్ల సర్ఫింగ్ లో భారత్ కు అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తారు. గత ఏడాది క్రికెట్ జట్టు మానసిక శిక్షకుడు ఉప్టాన్ మంత్రా సర్ఫింగ్ క్లబ్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో క్రికెట్ టీమ్ బెంగళూరుకు వచ్చినప్పుడు ఆశ్రమంలోని యువకులు మ్యాచ్ కు వెళ్తారని స్వామీజీ చెప్పారు. వెబ్ సైట్లలో సర్ఫింగ్ గురించి రూపొందించడం, వెబ్ ల ద్వారా ఫోటోలను విక్రయించడం ద్వారా ఆశ్రమానికి ఆర్థిక మద్దతు లభిస్తోంది.
News Posted: 9 November, 2009
|