తాబేలు తెచ్చిన తంటా భువనేశ్వర్ : తాబేలుకు యోగం పట్టింది. కానీ దానిని పట్టుకుని పూజలు చేస్తున్న గ్రామస్థులకు మాత్రం గ్రహణం పట్టింది. కేసుల్లో ఇరుక్కున్నారు. భారతీయులు దశావతారాల్లో ఒకటిగా భావించే తాబేలు... అందులోనూ 'డిప్పు'పై నల్లనిమచ్చలు గల అరుదైన తాబేలుని ఒరిస్సాలోని కేంద్రపారాజిల్లా ఖడిపాల్ గ్రామస్తులకు దొరికింది. దానిని పట్టుకుని గ్రామంలోకి తీసుకువచ్చి పూజలు చేయడం ప్రారంభించారు. సంపూర్ణ భక్తి భావంతో శ్రీకూర్మాన్ని కొలవడం ప్రారంభించారు. ఈ తాబేలుని వారు జగన్నాధుని సజీవ రూపంగా భావించారు.
కానీ అరుదైన జాతికి చెందిన ఈ తాబేలుని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. దానిని నదిలో వదిలేయమని గ్రామస్ధులను కోరారు. కానీ సాక్షాత్తూ జగన్నాధుని ప్రతిరూపమైన తాబేలును వదిలేది లేదని వారు ఖండితంగా చేప్పేశారు. అటవీ శాఖ అధికారులను మొత్తం గ్రామ ప్రజలంతా ప్రతిఘటిస్తున్నారు. ఈ విషయమై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ బెహరా మాట్లాడుతూ, 'అరుదైన జాతికి చెందిన తాబేలుని అప్పగించేందుకు గ్రామస్తులు నిరాకరించారు. ఆ తాబేలు డిప్పపై గల నల్ల మచ్చల కారణంగా దైవాంశగల తాబేలుగా భావించడమే ఇందుకు కారణం' అని చెప్పారు. వారిని ఎలాగైనా ఒప్పించి అది సహజంగా తిరుగాడే నదిలోకి వదిలేయించాలని చూశాం. కానీ లాభం లేకపోయింది. వారిపై మేం చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేక పోయింది అని వివరించారు. తాబేలుని బంధించిన చోట కొంతమంది పూజారులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వన్యప్రాణ సంరక్షణ చట్టం - 1972 కింద కేసులు నమోదు చేశారు. దీని కింద తాబేలును పూజిస్తూ వదలడానికి నిరాకరిస్తున్న వారికి జైలు లేదా జరిమానా విధించవచ్చు. అయితే 'దైవ కూర్మాన్ని' సొంతం చేసుకున్న గ్రామస్తులు మాత్రం ఏం జరుగుతుందో చూద్దాం... కానివ్వండి అంటున్నారు. శ్రీ'కూర్మ'నారాయణా! మేలుకో.... మమ్మేలుకో! అని భక్తి గీతాలు ఆలాపిస్తున్నారు.
News Posted: 10 November, 2009
|