సోమవారం 'తెగులు' లండన్ : సోమవారం అనగానే... బ్యాంకుల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇతర సంస్థల్లోనూ పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తెలుసు. కానీ లండన్ పరిశోధకులు మాత్రం సోమవారాన్ని కొందరు 'ఉద్యోగులు జబ్బు పడే రోజు'గా తమ అధ్యయనంలో గుర్తించారు. మెర్సెర్ అనే సంస్థ 'సిక్ లీవు'ల్లో మూడొంతుల మంది వారంలో మొదటి రోజునే ఉద్యోగులు వాడుతున్నారని అభిప్రాయపడింది. ఎముకలు... కండరాల నొప్పి అంటూ తమ సెలవు పత్రాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉదహరిస్తున్నారు. ఈ కారణం తర్వాత స్థానాల్లో వైరల్ ఇన్ ఫెక్షన్, మానసిక ఒత్తిడి, తదితర కారణాలు ప్రాధాన్యతా క్రమంలో ఉన్నాయని బీబీసీ వార్తా సంస్థ పేర్కొన్నది.
ఉద్యోగుల అనారోగ్యానికి సంభందించి... ప్రైవేట్ సంస్థల్లోని 11 వేల మంది ఉద్యోగుల సెలవుల ఆధారంగా సోమవారాన్ని సిక్ డేగా పరిగణించారు. జనవరిలో 20 రోజుల్లో 13 రోజులు 'సిక్ లీవు'లుగా గమనిస్తే వీటిలో ఎక్కువగా జనవరి 2 నుంచి 9 మధ్యనే ఉన్నాయి. అనారోగ్యం పేరిట గురు, శుక్రవారాల్లో సెలవు తీసుకున్నఉద్యోగుల శాతం దాదాపు ఐదుగా ఉంది. సోమవారాన్ని 'సిక్ లీవు'గా వాడిన ఉద్యోగులు 35 శాతం మంది ఉన్నారు. శుక్రవారాన్ని సెలవు దినంగా 3 శాతం మంది వాడేశారు! ఆయా విభాగాల్లో సత్సంబంధాలు లోపించినప్పుడు, నైతిక బాధ్యత తక్కువగా ఉన్నచోట, ఉద్యోగుల పాత్ర పరిమితంగా ఉన్నచోట సోమవారం కాస్తా జబ్బువారంగా మారిందని పరిశోధకుడు ఫిరోజ్ బిలమోరియా చెప్పారు.
'యాజమాన్యం ఎక్కువ ఫలితాలు ఆశిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అధికంగా పని చేయడం వల్ల వత్తిడికి లోనవుతున్నారు. వీరు తిరిగి కోలుకోవాల్సి ఉంటోంది' అని ఆరోగ్య మానసిక వేత్త ప్రొఫెసర్ కేరీ కూపర్ తెలిపారు. 'అనేకమంది ఉద్యోగులు సెలవు దినంగా ఆదివారం ఒక్కటే చాలడం లేదని భావిస్తున్నారు. దీంతో అదనంగా సోమవారాన్ని సిక్ లీవ్ గా తీసుకుంటున్నారు. కానీ వారు తమ అనారోగ్యానికి అసలైన కారణాలను చెప్పడం లేదన్నది నా అనుమానం' అని ఆయన అభిప్రాయపడ్డారు.
News Posted: 11 November, 2009
|