తిన్నా కూడా కొవ్వు పరీక్ష లండన్ : గంటల తరబడి ఏమీ తినకుండా ఉపవాసాలు ఉండటం ఇంక అనవసరం. రక్తంలో ఉండే కొలెస్టరాల్ శాతాన్ని తెలుసుకోడానికి పరీక్షలు చేయించుకునే వారికి ఇది నిజంగానే శుభవార్త. పరీక్షకు రక్తం ఇచ్చే ముందు గంటల తరబడి ఆహారం తీసుకోకుండా ఉండటం అనవసరమని, నీరసం రావడం, కళ్లు తిరగడం మినహా ఈ ఉపవాసం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఒక అద్యయనం నిరూపించింది. కొలెస్టరాల్ పరీక్షకు రక్తం ఇచ్చే ముందు కనీసం పద్నాలుగు గంటలైనా నిరాహారంగా ఉండాలని డాక్టర్లు చెబుతారు. కానీ ఆహారం తిన్న తరువాత రక్త పరీక్షలు చేస్తే దాని ఫలితాలు కూడా చాలా కచ్చితంగానే ఉన్నాయని దీనిపై పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ జాన్ డానిష్ చెప్పారు. తన పరిశోధన వివరాలను అమెరికా మెడికల్ అసోసియేషన్ పత్రికలో ప్రకటించారు.
ఈ పరీక్షలు గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి తీసుకునే జాగ్రత్త కోసం చేస్తారు. రక్తంలో పేరుకుపోయిన కొవ్వు శాతాన్ని పరీక్షించి వైద్యులు చికిత్స చేస్తారు. ఈ కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరితే అది గుండె నుంచి మంచి రక్తాన్ని శరీరంలోకి తీసుకపోయే ధమనుల్లో పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తుంది. ఆహారం తీసుకుంటే దానిలోని కొవ్వు కూడా రక్తంలో చేరి పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఉపవాసం ఉండమని సలహా ఇస్తారు. పరీక్ష చేయించుకోవలనుకున్న వారు మరచిపోయి ఆహరం తినేస్తే మరో రోజు రమ్మంటారు కానీ పరీక్షలు చేయరు. ఇదంతా సమయాన్ని వృధా చేయడమేనని డానిష్ చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రతీ రోజూ కొలెస్టరాల్ పరీక్షల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క ఇంగ్లాండ్ లోనే రోజూ పాతిక లక్షల మంది ఈ పరీక్ష చేయించుకుంటున్నారు.
గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్న 21 దేశాలలో ఈ అద్యయనం చేసినట్లు డానిష్ వివరించారు. దాదాపు 3 లక్షల మందికి పరీక్షలు చేసి నిరాహారంగా ఉన్నా, ఆహారం తీసుకున్న ఫలితాల్లో పెద్ద తేడా లేకపోవడాన్ని గమనించామని ఆయన చెప్పారు. ఆహారం తీసుకున్న వారి రక్తం పరీక్ష కూడా కొలెస్టరాల్ లెక్కను బాగానే చూపిందని ఆయన తెలిపారు. కాబట్టి కొవ్వు పరీక్ష కోసం వెళ్ళే ఇక నిరభ్యరంతంగా శుభ్రంగా తినే రావచ్చని వైద్యులు చెప్పవచ్చు.
News Posted: 12 November, 2009
|