ఆ పిల్ల తుమ్ముల మిషన్! వాషింగ్టన్ : నిముషానికి ఎనిమిది, తొమ్మిది సార్లు... రోజుకు కనీసం పన్నెండు వేల సార్లు... తుమ్ముల మీద తుమ్ములు. తలచుకుంటేనే నరకం కనిపిస్తోంది కదా? పాపం పన్నెండేళ్ళ చిన్నారికి ఈ జబ్బు పట్టుకుంది. తుమ్మలేక చచ్చిపోతోంది. నీరసంతో కూలబడిపోతంది. ఎంత మంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది. ఆగుకుండా వస్తున్న తుమ్ములతో పాపం ఆ పాప ఏకంగా చదువే మానేసింది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన లారెన్ జాన్సన్ అనే పన్నెండేళ్ల చిన్నారికి రెండు వారాల క్రితం జలుబు చేసింది. అదికో అప్పటి నుంచి ఆ అమ్మాయి తుమ్ముతూనే ఉంది. తాను ఎంత ప్రయత్నించినా తుమ్ములను ఆపుకోలేకపోతున్నానని వాపోతోంది లారెన్. ఈ జబ్బును 'మెషిన్ గన్ తుమ్ములు' అంటారని వైద్యులు చెబుతున్నారు.
లారెన్ కు ప్రతీ నిముషం, ప్రతీ రోజూ నరకంలానే గడుస్తోందని ఆమె తల్లి లిన్ జాన్సన్ వివరించింది. లారెన్ కు తుమ్ములు మొదలైన తరువాత ఆరుగురు వైద్యులు పరీక్షించారని, కానీ ఏమీ చేయలేక చేతులెత్తేశారని లిన్ చెప్పింది. ఇది మానసిక వత్తిడి వల్ల కలిగే ఇర్రెట్రాక్టబుల్ సైకోజెనిక్ డిజార్డర్ కావచ్చని ఒక న్యురాలజిస్ట్ అభిప్రాయపడ్డాడు. కాగా తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇలాంటి జబ్బు ప్రపంచంలో 40 మందికి మాత్రమే వచ్చిందని లిన్ తెలిపారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో ఎవరికీ తెలియదని ఆమె అన్నారు. కొన్ని కేసులలో కొంత కాలం గడిచిన తరువాత తుమ్ములు ఆగిపోయాయని, అయితే చాలా మందిలో అది మళ్ళీ మళ్ళీ తిరగబెట్టిందని ఆమె చెప్పారు. లారెన్ కు కూడా తుమ్ములు ఆగుతాయని, కాని ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మాత్రమే తుమ్ములు రావడం లేదని లిన్ వివరించారు.
News Posted: 12 November, 2009
|