ఇచ్చట మూత్రము పోయుము లండన్ : ఇచ్చట మూత్రము పోయరాదు... ఇది మనకు వీధుల్లో ఏ గోడలపైనైనా కనిపించే హెచ్చరిక(చాలా మంది పట్టించుకోరనుకోండి). బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తే జరిమానాలు విధిస్తామని బెదిరింపులు కూడా ఉంటాయి. మానవ మూత్రం అనారోగ్యాలను వ్యాపించచేస్తుందని వైద్యులు చెబుతారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను నిషేధించడం మనకు తెలుసు. మన నగరాల్లో తిరిగేటప్పుడు అర్జెంటు అయితే అర్ధరూపాయో, రూపాయో ఇచ్చి సులభ్ కాంప్లెక్సుల్లో లఘుశంక తీర్చుకోవాల్సిందే. కానీ ఇదిగో లండన్ లోని ఒక స్వచ్చంద సంస్థ మాత్రం మరుగుదొడ్లలో మూత్ర విసర్జన వలన నీటిని వృధా చేస్తున్నామని గగ్గోలు పెడుతోంది. మూత్ర విసర్జన అనంతరం బాత్ రూంను శుభ్రపరచడానికి నీటిని, శక్తిని వృధా చేస్తున్నామని నేషనల్ ట్రస్ట్ అనే ఈ సంస్థ చెబుతోంది.
కాబట్టి పురుషులు బహిరంగ ప్రదేశాలలో ఉండే చెత్తకుప్పలపై మూత్ర విసర్జన చేయడం అన్ని విధాలా లాభమని వివరిస్తోంది. దీనివలన పోలాలకు, గార్డెన్లకు మంచి సహజసిద్ధమైన ఎరువును అందివ్వడమే కాకుండా మరుగుదొడ్ల శుభ్రత కోసం వాడే నీటినీ ఆదా చేసుకోవచ్చని చెబుతోంది. మూత్రం పోసిన తరువాత మరుగుదొడ్డిని కడగటానికి దాదాపు నాలుగున్నర నుంచి తొమ్మిది లీటర్ల నీటిని వినియోగిస్తారని, ఇలా ఈ నీటిని వృధాగా వాడకుండా కొద్దిగా శుద్ధి చేసుకుంటే అది మనకు తాగడానికి ఉపయోగపడే మంచినీరుగా మారుతుందని సంస్థ ప్రతినిధి టామ్జిన్ ఫిలిప్స్ చెప్పారు. చెత్తకుప్పలను సారవంతమైన సేంద్రీయ ఎరువుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి మూత్రం దోహదం చేస్తుందని ఆయన వివరించారు. స్త్రీల మూత్రం కంటే ఆమ్లలక్షణాలు తక్కువ ఉండటం వలన పురుషుల మూత్రమే సేంద్రీయ ఎరువు తయారీకి మంచిదని కూడా ఆయన సెలవిస్తున్నారు.
News Posted: 16 November, 2009
|