మహిళా 'వయాగ్రా' న్యూయార్క్: మానసిక వత్తిడిని దూరం చేయడానికి ఉపయోగించే ఓ మందు మహిళలకు వయాగ్రా వలే పనిచేస్తోందని వైద్యులు కనుగొన్నారు. సెక్స్ కోరికలు తగ్గిపోయిన స్త్రీలకు ఈ మందును ఇచ్చినప్పుడు అది వారిలో వాంఛలను పెంచిందని వారు సోమవారం వెల్లడించారు. 'ఫ్లిబన్సెరిన్' అనే ఈ మందును సాధారణంగా మానసికవత్తిడిని తగ్గించడానికి వినియోగిస్తారు. దీనిని ఉపయోగిస్తున్న మహిళల్లో శృంగార భావనలు పొటమరించడాన్ని గమనించిన వైద్యులు ఆ దిశగా పరీక్షలు నిర్వహించారు. వీరు జరిపిన మూడు అధ్యయనాలు కూడా ఫ్లిబన్సెరిన్ మహత్స్యాన్ని ధృవీకరించాయి.
తక్కువ సైక్స్ కోరికలు ఉండే మహిళలకు ఈ మందును ఇచ్చినప్పుడు వారి మెదడు ఉత్తేజితమై వారిలో శృంగార భావనలు వృద్ధి చెందాయని నార్త్ కరోలిన విశ్వవిద్యాలయంలోని గైనకాలజీ విభాగం జూనియర్ ప్రొఫెసర్ జాన్ ఎం థార్ప్ చెప్పారు. ఫ్లిబన్సెరిన్ అనేది చాలా తక్కువ మోతాదు వత్తిడి నివారణ ఔషధమని, కానీ మహిళల్లోని సెక్స్ సమస్యల పరిష్కారానికి ఇది దివ్యౌషధంగా మారిందని ఆయన చెప్పారు. ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా అండ్రోజెన్ రీప్లేస్ మెంట్ చికిత్సకు దీనిని ఉపయోగించవచ్చని, స్త్రీలలో సెక్స్ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతానికి ఇంతకంటే మెరగైన మందు లేదని ఆయన తెలిపారు. పురుషుల్లో స్తంభన సమస్యలు వచ్చినట్లే మహిళల్లో శృంగార కోర్కెలు తగ్గడం, సెక్స్ సామర్ధ్యం తగ్గడం సాధారణమని, ఇలాంటి వారికి వయాగ్రా లాంటి మందు అవసరం ఉందని ఆయన అన్నారు.
News Posted: 16 November, 2009
|