విదేశీ విడాకులు చెల్లుతాయి న్యూఢిల్లీ : విదేశాలలోని ఏదైనా కోర్టులో తీసుకున్న విడాకులు ఇండియాలో చెల్లుబాటు అవుతాయని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విషయమై చాలా కాలంగా ఉన్న సందిగ్ధతను సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా తొలగించింది. ఇండియాలో కన్నా కొన్ని ఇతర దేశాలలో విడాకులు పొందడం తేలిక. ఇండియాలో వైవాహిక బంధం రద్దుకు కారణాలు పరిమితం. వాది, ప్రతివాదులలో ఎవరు లేకపోయినా సాధారణంగా విడాకులు మంజూరు చేయరు.
ఉదాహరణకు ఎవరైనా ప్రవాస భారతీయుడు (ఎన్ఆర్ఐ) ఒక భారతీయ యువతిని వివాహం చేసుకుని, ఆమెను స్వదేశంలోనే వదలి తాను నివసిస్తున్న దేశంలో విడాకులు పొందినట్లయితే ఆ వైవాహిక బంధం రద్దయినట్లుగానే భారతీయ న్యాయస్థానాలు కూడా పరిగణించాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టం చేస్తున్నది. ఇప్పటి వరకు విదేశాలలో తీసుకున్న విడాకుల విషయమై స్పష్టమైన ఆదేశం ఏదీ లేనందున ప్రతి న్యాయస్థానం తనదైన రీతిలో అన్వయిస్తూ వస్తున్నది.
కెనడాకు చెందిన తన భార్యకు కెనడాలో విడాకులు ఇచ్చి ఇండియాలో పునర్వివాహం చేసుకున్న పశౌరా సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. పశౌరా సింగ్ రెండవ పెళ్ళి చేసుకున్నాడనే ఆరోపణతో దాఖలు చేసిన కేసును హైకోర్టు ధ్రువీకరించగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. విడాకుల కేసు గురించి తనకు తెలియదని అతని మొదటి భార్య చెప్పినప్పటికీ ఆ డిక్రీపై స్టే మంజూరు చేయడం గాని, దానిని కొట్టివేయడం గాని జరగలేదని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
కెనడా పౌరురాలైన కమల్జీత్ కౌర్ ను 1997లో వివాహం చేసుకున్నప్పుడు పశౌరా పంజాబ్ వాసి. అతను ఆమెతో కెనడాలో స్థిరపడ్డాడు. 2001లో అతను బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టులో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అతను ఇండియాలో తిరిగి వివాహం చేసుకుని కెనడాలో తిరిగి నివాసం ఏర్పరచుకున్నాడు. దీనితో కమల్జీత్ సోదరుడు పంజాబ్ లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు.
News Posted: 17 November, 2009
|