లిక్కర్ కాఫీ వస్తోంది న్యూఢిల్లీ : తాతల నాటి నుంచి వస్తున్న ఫిల్టర్ కాఫీ... ఇన్ స్టాంట్ కాఫీ... బ్లాక్ కాఫీ... హాట్ కాఫీ... కోల్డ్ కాఫీ తాగీ...తాగీ బోర్ కొట్టేస్తోందా? కాఫీ తాగాలి... మస్తు మజాగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఇదిగో మీ కోసం కొత్త కాఫీ వచ్చేసింది. అదే లిక్కర్ కాఫీ. కాఫీ తాగినట్టూ ఉంటుంది. కిక్కు ఎక్కినట్లూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ లిక్కర్ కాఫీ నెమ్మదిగా జనం మది దోచుకుంటోంది. కొద్దిగా కేరామిల్ ను గ్లాసులో పోయండి... దానికి ఒక ఎస్ ప్రెసో కలపండి... సగం కప్పు వేడినీరు వేయండి...దానిలో అర పెగ్గు ఐరిష్ విస్కీ దట్టించండి...దానిపై అందంగా మీగడను అలంకరించండి... అంతే మీ మనస్సుకు ఆహ్లాదాన్ని అందించే కమ్మని గ'మ్మత్తై' గొల్డెన్ ఐరిష్ కాఫీ సిద్ధం అయిపోయింది.
కాఫీ తాగాలనే వాంఛనూ, మందు కొట్టాలనే కోరికను ఏకకాలంలో తీర్చే ఈ గోల్డెన్ ఐరిష్ కాఫీయే లిక్కర్ కాఫీ. భారతదేశంలో దీనిని ఇంతకాలం కేవలం ఐదు నక్షత్రాల హోటళ్ళకు, కొన్ని బార్లుకు పరిమితం చేశారు. గోల్డన్ ఐరిష్ కాఫీ హట్, కోల్డ కాఫీలుగా అందించేవారు. ఇప్పుడు ఇటాలియన్ కాఫీ వ్యాపార సంస్థ 'లావజ్జ' లిక్కర్ కాఫీని దాని అన్ని అమ్మకం కేంద్రాల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నది. ఇంతకాలం దొరుకుతున్న కాఫీలతో ప్రజలు విసుగెత్తిపోయారని, తమ వినియోగదారుల మనసు తెలుసుకోవడంలో లావజ్జ ఎప్పుడూ ముందు ఉంటుందని, అందుకే లిక్కర్ కాఫీని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని బరిస్తా కాఫీ కంపెనీ ప్రతినిధి సంజయ్ కాటినో చెప్పారు.
మద్యం సరఫరా చేయాలంటే దానికి ఎల్-4 లైసెన్సు అవసరమని, దానికి అనేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అందుకే ప్రస్తుతం తాము లిక్కర్ కాఫీని ఢిల్లీలోని ఒక్క అవుట్ లెట్ లోనే విక్రయిస్తున్నామని, త్వరలోనే మిగతా నగరాలకు విస్తరిస్తామని సంజయ్ వివరించారు. దానికి అవసరమైన అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేశామన్నారు. లిక్కర్ కాఫీని అందిస్తున్న మొదటి కాఫీ చైన్ బరిస్తాయే. కేఫ్ మోషే కూడా లిక్కర్ కాఫీ ఇస్తోంది కాని దానిలో విస్కీ కి బదులుగా ఆ రుచి వచ్చే ఫ్లేవర్సను ఉపయోగిస్తున్నారు. లిక్కర్ కాఫీ ధర మాత్రం 199 నుంచి 399 రూపాయల మధ్య ఉంటుంది.
News Posted: 18 November, 2009
|