ప్రేమికునితో పెళ్ళానికి పెళ్ళి భువనేశ్వర్ : బాలీవుడ్ సినిమా తీయడానకి అవసరమైన మిర్చి మసాలా, ట్విస్ట్ లు ఉన్న రెడీమేడ్ స్క్రిప్ట్ ఇది. ఎక్కడో విదేశీ సినిమాల్లో కనిపించే కథ ఇక్కడ నిజ జీవితంలోనే జగిరిగింది. విరహాలు, సుఖాలు, దుఃఖాలు... చివరకు పాత్రలన్నీ కలసి సుఖాంతమైన ముగింపునే ఇచ్చాయి. కానీ ఇద్దరు పిల్లలు మాత్రం... వారి మనస్సుల్లో ఏముందో చెప్పలేకపోయారు. ఒరిస్సాలోని ఒక గ్రామంలో నివశిస్తున్న వ్యక్తి తాను పద్దెనిమిది యేళ్ల పాటు కాపురం చేసిన భార్యను ఆమె ప్రేమికునికి అప్పగించడానికి అంగీకరించాడు. వారిద్దరూ వయస్సులను మరచి గాఢమైన ప్రేమలో మునిగిపోయారని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని తెలుసుకున్న ఆ వ్యక్తి ప్రేమికునితో వెళ్ళిపోమ్మని భార్యను పంపించివేశాడు. ఇద్దరు పిల్లలు మాత్రం అతనితోనే ఉండిపోతామన్నారు.
ఒరిస్సాలోని బారిఘడ్ జిల్లాలోని బిరామి గ్రామంలోని భోజ్ రాజ్ దాస్(48) భార్య జసోవంతి(40) కనిపించకుండా పోయింది. దాంతో దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను పక్క గ్రామం నిలేష లో ఒక హోటల్ లో పట్టుకున్నారు. ఆమెతో పాటు యువప్రియుడు నికుంజ్ బారిక్(25) కూడా ఉన్నాడు. దాంతో ఇద్దరు గురించి తెలుసుకున్న దాస్ భార్యను ప్రేమికుడిని వివాహం చేసుకోమ్మని సలహా ఇచ్చాడు. అయితే విడాకులు తీసుకున్న తరువాతే వివాహం చెల్లుబాటు అవుతుందని పోలీసులు చెప్పడంతో దానికి అవసరమైన అన్ని పత్రాలపై దాస్ సంతకాలు చేసి, భార్యను దీవించి పంపేశాడు.
News Posted: 23 November, 2009
|