కొండను తవ్వి... పాట్నా : బీహార్ రాష్ట్రంలో ఒక గ్రామస్థుడు ఉలి, సుత్తి ఉపయోగించి 14 సంవత్సరాల పాటు శ్రమించి ఒక కొండ మధ్యలో సొరంగం ఏర్పాటు చేశాడు. తన ఇంటి ముందు తన లారీని నిలిపి ఉంచడం కోసమే అతను ఈ కొండను తవ్వాడు.
'కొండ నా దారికి అడ్డంగా ఉన్నందున నా ట్రక్కును నా ఇంటి సమీపంలో నిలిపి ఉంచలేకపోతున్నాను' అని తూర్పు బీహార్ లోని గయ జిల్లా వాసి అయిన 53 సంవత్సరాల రామచంద్ర దాస్ 'రాయిటర్స్' విలేఖరితో చెప్పాడు. దొంగలు తన ట్రక్కును దొంగిలిస్తారేమోననే భయమే తనను ఇందుకు పురికొల్పిందని, అధికారులు సాయపడడానికి నిరాకరించిన తరువాత స్వయంగానే సొరంగాన్ని ఏర్పాటు చేశానని రామచంద్ర దాస్ వివరించాడు. 'కొన్ని మైళ్ళ దూరంలో నా ట్రక్కును నేను వదలి రావలసి వస్తున్నది. అందుకే నేనే ఏదో చేయాలని నిర్ణయించుకున్నాను' అని దాస్ చెప్పాడు.
అయితే, కొండ ఆవలి ప్రాంతానికి వెళ్ళడానికి మైళ్ల కొద్ది కాళ్ళకు పని చెప్పవలసి వస్తున్న స్థానిక గ్రామస్థులు ఇప్పుడు తమ పొలాలు చేరుకోవడానికి 14 అడుగుల (4.2 మీటర్ల) వెడల్పు ఉన్న ఈ సొరంగాన్నే ఉపయోగిస్తున్నారు. దాస్ ధర్మమా అని తమకు ఈ వెసులుబాటు కలిగిందని అంటూ వారు అతనిని బహుధా ప్రశంసిస్తున్నారు. 'తన లక్ష్య సాధన కోసం ఇంతలా పాటు పడే మనిషి మనకు అరుదుగా కనిపిస్తాడు' అని స్థానిక ప్రభుత్వ అధికారి ప్రభాత్ కుమార్ ఝా అన్నారు.
News Posted: 2 December, 2009
|