కన్నతల్లికే 'ఐపి'ఎస్ కోలకతా : వృద్ధాప్యంలో తాను తలదాచుకుంటున్న ఇంటిని కన్న కొడుకే బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తల్లిని రోడ్ల పాలు చేసైనా తాను బతకడానికి ఇల్లు లాక్కుంటన్న వ్యక్తి నిరక్షరాస్యుడూ కాదు ... నిరుద్యోగి అంతకంటే కాదు. కూటికి, గుడ్డకి, నీడకు ముఖం వాచిపోయిన దరిద్రుడూ కాదు. సాక్షాత్తూ ఐపిఎస్ అధికారి. అన్ని రకాలుగానూ నాలుగు రాళ్లు వెనుకేసుకునే సామర్ధ్యం కలవాడునూ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ పి)గా పనిచేస్తున్న చంపక్ భట్టాచార్యపై ఆయన తల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. చంపక్ భట్టాచార్య తనను వేధిస్తున్నట్లు, సాల్ట్ లేక్ 'బిసి' బ్లాక్ లోని తన ఇంటిని బలవంతంగా హస్తగతం చేసుకోవడానికి తనను హింసకు గురిచేస్తున్నాడని న్యాయస్థానానికి మొరపెట్టుకుంది.
ఐపిఎస్ అధికారి తల్లి బేలా భట్టాచార్య, సోదరుడు, వదిన సాల్ట్ లేక్ ఇంటిలో నివసిస్తుండగా ఎస్ పి చంపక్ కృష్ నగర్ లో నివాసం ఉంటున్నారు. బేలా భట్టాచార్య ఫిర్యాదుపై గురువారం విచారణ జరుపుతూ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ప్రణబ్ ఛటోపాధ్యాయ ఆమెకు తగిన భద్రతను సమకూర్చవలసిందిగా డిజిపి భూపీందర్ సింగ్ ను ఆదేశించారు. 65 సంవత్సరాల బేలా వితంతువు. ఇంటిలో నుంచి తనను కొడుకు బయటకు గెంటి వేస్తాడని ఆమె భయపడుతున్నారు. కుమారుడు చంపక్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని బలవంతం చేస్తున్నాడని ఆమె కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీకి, డిజిపి సింగ్ కు లేఖలు రాశారు. కాని వారి దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో ఆమె న్యాయం కోసం కోర్టును శరణు వేడారు.
News Posted: 4 December, 2009
|