చలి చంపేసింది బంకూరా : వణికించేస్తున్న చలిని తట్టుకోడానికి బొగ్గుల మంట వేసుకుని, అన్ని తలుపులూ మూసేసి వెచ్చగా నిద్రపోయిన వారికి ఇంత తెల్లారలేదు. వెచ్చని సూర్యకిరణాలను చూసే భాగ్యం కలగలేదు. ఈ విషాదం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దాదాపు 210 కిలో మీటర్ల దూరంలో బంకూరా జిల్లా ఓండా బ్లాకులోని నకాయిజురి గ్రామంలో సోమవారం రాత్రి చలిని తట్టుకోవడానికి తమ గదిలో నిప్పు రాజేసి, గది తలుపులు మూసివేసిన ఆరుగురు పౌల్ట్రీ కార్మికులు విగతజీవులై కనిపించారు.
వర్కర్ల క్వార్టర్లలో ఉదయం టీ కోసం వచ్చిన ఒక ఫార్మ్ గార్డు తాను ఎంతగా పిలిచినప్పటికీ ఎవరూ సమాధానం ఇవ్వకపోవడంతో ఇతరులను అప్రమత్తం చేశాడు. వారు తలుపు పగులగొట్టి లోనికి వెళ్ళి చూడగా ఆ ఆరుగురూ 'నిద్రిస్తున్నట్లు'గా కనిపించారు. అయితే, 'మాకు అనుమానం వేసి వారికి ఊపిరాడుతున్నదేమోనని పరీక్షించాం. వారి ఊపిరి నిద్రలోనే ఆగిపోయింది' అని గార్డు రాణా గోస్వామి చెప్పాడు.
ఊపిరాడకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 'వారు గదిలో వెచ్చదనం కోసం మట్టి కొలిమిలో బొగ్గులతో నెగడు వెలిగించారు. అయితే, కిటికీలన్నీ మూసివేయడమనే పొరపాటు వారు చేశారు. మూసి ఉన్న గదిలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ కలగలిసి పోవడంతో ఆక్సిజన్ హరించుకుపోయింది. దానితోనే వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారు' అని ఒక అధికారి పేర్కొన్నారు.
'కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు మగతలోకి నెడతాయి. కీలకమైన అవయవాలు విఫలం కావడంతో చివరకు మరణం ప్రాప్తిస్తుంది' అని బంకూరా వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక వైద్యుడు ఎస్. మజుందార్ వివరించారు. కొన్ని రోజులుగా బంకూరాలో ఉష్ణోగ్రతలు సుమారు తొమ్మిడి డిగ్రీల సెల్షియస్ ప్రాంతాలలో ఉంటున్నది. సీతారామ్ రౌత్ (40), మహేష్ రౌత్ (32), గోవింద్ యాదవ్ (25), పంచు బాజ్ పాయి (25), ప్రమద మండల్ (40)లు ఒక్కొక్కరి వద్ద మందమైన దుప్పటి ఉంది. 'వారు అమృత్ హాచరీస్ సంస్థలో పని చేస్తున్న క్యాజువల్ వర్కర్లు. వంట, తదితర పనుల కోసం వారిని తమ కోలకతా ఆఫీసు నుంచి తీసుకువచ్చారు' అని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఆర్.కె. ఝజారియా తెలిపారు. కాగా, ఈ విషయమై వ్యాఖ్యానించడానికి అమృత్ సంస్థ అధికారి నిరాకరించారు.
News Posted: 30 December, 2009
|