శవానికి పూజలు భువనేశ్వర్ : తండ్ర్రి ప్రాణాలను దేవుడు తిరిగి ఇస్తాడని నమ్మిన ఓ తనయుడు శవానికి మూడు రోజులపాటు పూజలు చేశాడు. క్షణం కూడా తండ్రి మృతదేహాన్ని వదలకుండా ఓ గదిలో ఏకాంతంగా గడిపాడు. ఈ ఉదంతం ఒరిస్సాలో జరిగింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి శవానికి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఒరిస్సాలోని జగత్సింగ్ పూర్ జిల్లాకు 100 కి.మి. దూరంలోని గలుపాడ గ్రామంలో నివశిస్తున్న దేవన్ బిశ్వాల్( 35) తండ్రి అనారోగ్యంతో సోమవారం మరణీంచాడు. అయితే తండ్రి హఠాన్మరణాన్ని తట్టుకోలేని బిశ్వాల్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. తన తండ్రి శవానికి అంత్యక్రియలు జరగకుండా మృతదేహాన్ని ఒక గదిలో బంధించి అగరబత్తీలు వెలిగించడంతో పాటుగా తన తండ్రికి తిరిగి ప్రాణం పోయాలని దైవ ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు. శవానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు, గ్రామస్తులు యత్నాలు సాగించినప్పటికీ బిశ్వాల్ గది తలుపులు తెరవనేలేదు. ఇలా సోమవారం నుండీ బుధవారం వరకు ఆ గదిలోనే గడిపాడు. తమ ప్రయత్నం విఫలం కావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. చివరకు పోలీసులు రంగప్రవేళం చేసీ తలుపులు విరగకొట్టి శవానికి అంత్యక్రియలు జరిపించాల్సివచ్చింది. తన తండ్రి హఠాన్మరణాన్ని తట్టుకోలేక బిశ్వాల్ తీవ్ర మానసిక ఆవేదనతో కలత చెంది ఇలా చేసాడని స్థానిక పోలీసు అధికారి చెప్పారు.
News Posted: 2 January, 2010
|