'నెట్'తో ఆరు పెళ్ళిళ్ళు థెని (తమిళనాడు) : వంచనా శిల్పంలో ఆరితేరిన ఓ ప్రబుద్ధుడు వలపుల 'వల' విసిరాడు. ఆరుగురు మహిళలలో వివాహానికి ఇంటర్నెట్ ను ఒక సాధనంగా ఉపయోగించుకుని, ఆతరువాత వారిని వంచించి నగదు, నగలు దోచుకున్నాడు. అతనిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.
ఇటీవల తిరుపతిలో తనను వివాహం చేసుకున్న ఆ వ్యక్తిపై ఒక మహిళ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు అతనిని అరెస్టు చేశారు. తాను ఎంబిఎ గ్రాడ్యుయేట్ నని, యుఎస్ లో పని చేస్తున్నానని చెప్పి అతను తనను వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. తాను అతనికి 150 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 47 లక్షలు కట్నం ఇచ్చానని కూడా ఆమె చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు. తనకు ఏమీ చెప్పకుండా అతను థెని నుంచి వెళ్ళిపోయినప్పుడు తనకు అనుమానం కలిగిందని ఆమె తెలిపింది. ఆమె ఆ తరువాత నవంబర్ 26న ఐజి (దక్షిణ మండలం) వద్ద ఫిర్యాదు దాఖలు చేసింది. ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందానికి కొచ్చిలో ఉన్నాడని, ఉత్తరాదికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందింది. దానితో వారు వెంటనే కొచ్చి వెళ్ళారు. కాని అక్కడికి వెళ్ళిన తరువాత వారికి అతను తిరిగి థెని చేరుకున్నట్లు తెలిసింది.
అతను థెనిలో ఒక హోటల్ లో ప్రవేశించబోతుండగా అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను వద్ద నుంచి నాలుగు సిమ్ కార్డులు, కొన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఇంటర్నెట్ లో ఇటువంటి అడ్వర్టైజ్ మెంట్ల ప్రలోభానికి గురి కావద్దని తల్లిదండ్రులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News Posted: 4 January, 2010
|