'విలాసం' మారింది హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యభిచార వృత్తి మరింత సంఘటితంగా సాగుతోంది. ఇది వ్యభిచార గృహాల నుంచి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లకు చేరుకున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఎపిఎస్ఎసిఎస్) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, రాష్ట్రంలో వ్యభిచారం పది శాతం మేర పెరగడమే కాకుండా ఈ సంస్థ అజమాయిషీకి అందుబాటులో లేకుండా పోయింది కూడా.
రాష్ట్రంలో 140 పట్టణాలలో ఎయిడ్స్ లేదా హెచ్ఐవికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న గ్రూపులను గుర్తించేందుకు జరిపిన ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం వ్యభిచారుల కోసం అన్వేషణ 65 శాతం వరకు మొబైల్ ఫోన్ల ద్వారా సాగుతోంది. ఈ 140 పట్టణాలలో 55830 మంది వ్యభిచారిణులు ఉన్నారని అంచనా. వారిలో 51.7 శాతం మంది వీథులలో నిలబడుతుండగా, 42.8 శాతం మంది ఇళ్లలోనే ఉంటున్నారు. 4.6 శాతం మంది వ్యభిచార గృహాలలోను, 0.9 శాతం మంది లాడ్జిలలోను ఉంటున్నారు.
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, స్థానిక జాతరలు, పండుగలు, పారిశ్రామిక ఎగ్జిబిషన్లు వంటి సందర్భాలలో చాలా వరకు పట్టణాలలో వ్యభిచారిణుల సంఖ్య పెరుగుతోంది. వారిలో చాలా మంది సమీప గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలతో సహా పలు పట్టణాలలో మసాజ్, బ్యూటీ పార్లర్ల ముసుగులో వ్యభిచార వృత్తిని అనేక మంది సాగిస్తున్నట్లు కూడా ఈ సర్వేలో వెల్లడైంది. ఈ 140 పట్టణాలలో హెచ్ఐవికి గురయ్యే ప్రమాదం అత్యధికంగా ఉన్న 72284 మందిని గుర్తించారు. వారిలో అత్యధిక సంఖ్యాకులు కృష్ణా జిల్లాలోని పట్టణాలలో కనిపించారు. (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సర్వే ఇంకా సాగుతోంది.)
'హైదరాబాద్ లో ఈ వృత్తి సాగిస్తున్నవారి సంఖ్య గత కొన్ని సంవత్సరాలలో కనీసం పది శాతం మేర పెరిగింది. ఇప్పటి వరకు హై రిస్క్ జనాభాలో 50 శాతం మందిని మాత్రమే ఎపిఎస్ఎసిసిఎస్ తన పరిధిలోకి తీసుకురాగలిగింది. రాష్ట్రంలో 5.4 లక్షల మంది హెచ్ఐవితో జీవిస్తున్నట్లు అంచనా. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఎపిఎస్ఎసిఎస్ తన వ్యూహాన్ని రూపొందించి, గ్రేటర్ హైదరాబాద్ తో సహా మొత్తం 211 పట్టణాలలో తన లక్ష్యాన్ని పెంచగలదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సంహా అన్ని పట్టణాలలో ఈ గుర్తింపు ప్రక్రియను 2010 జనవరి నెలాఖరులోగా పూర్తి చేయగలం' అని సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.వి. చంద్రవదన్ తెలియజేశారు. ఉధృతంగా మాస్ మీడియా ప్రచార కార్యక్రమాన్ని రూ. 10 కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్ లో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. హెచ్ఐవి/ఎయిడ్స్ పై విజయవంతంగా నిర్వహించిన 'పులి రాజా' వంటి ప్రచార కార్యక్రమాల తరహాలో ఈ కార్యక్రమం సాగవచ్చు.
News Posted: 6 January, 2010
|