చేతబడి... కోటికి టోకరా పుణె : మన సమాజంలో మూఢవిశ్వాసాలు ఎంతగా పాతుకుపోయాయో ఈ ఉదంతమే ఒక ఉదాహరణ. క్షుద్ర శక్తులు, చేతబడి ట్రిక్కుతో ఓ మహిళ సాటి గృహిణి నుంచి కోటి రూపాయలకు టోకరా వేసింది. టక్కరితనంలో అందివేసిన ఓ 44 ఏళ్ళ గృహిణి రిటైరైన ఒక కల్నల్ భార్యతో స్నేహం చేసి మీ భర్తకు ఎవరో చేతబడి చేశారని, కొన్ని తంతులు జరిపిస్తే ఆయనకు నయమవుతుందని చెప్పింది. ఆ కల్నల్ కు నయం కాలేదు. కాని ఆయన భార్యకు మాత్రం రూ. 83 లక్షల చేతి చమురు వదిలింది. (ఆయన పార్కిన్సన్ వ్యాధితో డిసెంబర్ లో మరణించారు.)
స్వర్గీయ కల్నల్ ప్రమోద్ దేవధర్ భార్య సుజాతా దేవధర్ (61)ని రూ. 83.91 లక్షల మేరకు మోసగించిందనే ఆరోపణపై గణేశ్ బాగ్ సొసైటీ వాసి రూచా గాడ్సేని కొత్రూడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన 2003 మే 13, ఆగస్టు 3 మధ్య జరిగింది. అసిస్టెంట్ పోలీస్ ఇన్ స్పెక్టర్ ఎ.డి. వలాంబే చెప్పిన సమాచారం ప్రకారం, ఫిర్యాదీ భర్త పార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆ దంపతులు గణంజయ్ సొసైటీలో ఒక బంగళాలో వేరెవరితోను సంబంధం లేకుండా నివసిస్తున్నారు. వారి పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. 'సుజాతా దేవధర్ అస్వస్థుడైన తన భర్తతో కలసి తమ బంగళా వరండాలో కూర్చుంటుండేవారు. పొరుగున నివసిస్తుండే రూచా గాడ్సే ఒకసారి వారిని కలుసుకుంది. ఆమెతో పరిచయం పెరిగిన తరువాత రూచా మీ భర్తకు ఎవరో చేతబడి చేశారని సుజాతతో చెప్పింది. తనకు జ్యోతిషం బాగా తెలుసునని, కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఆయనకు నయం చేయించగలనని అనుమానితురాలు చెప్పింది' అని వలాంబే వివరించారు.
'తాను నవగ్రహ పూజ జరిపిస్తానని, దీనితో మీ భర్తకు చేతబడి ప్రభావం తొలగిపోతుందని సుజాతతో రూచా చెప్పింది. ముందు జాగ్రత్తగా మీ వద్ద ఉన్న నగదును తనకు ఇవ్వాలని, పూజ పూర్తయిన తరువాత తాను వాపసు చేస్తానని రూచా సూచించింది' అని వలాంబే తెలిపారు. అలా మూడు మాసాల వ్యవధిలో రూచా కోటి మూడు లక్షల రూపాయల మేరకు సుజాత నుంచి రాబట్టిందని, 'రూచా కోరినప్పుడల్లా సుజాత డబ్బు ఇచ్చింది. ఒక్కొక్కసారి ఆమె బంధువుల వద్ద అప్పు చేసింది' అని వలాంబే తెలిపారు.
సుజాతకు రూచా రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చింది. మిగిలిన మొత్తానికి రూ. 83.91 లక్షలకు మూడు చెక్కులను ఆమె ఇచ్చింది. అయితే, చెక్కులేవీ చెల్లలేదు. ఇది ఇలా ఉండగా, సుజాత భర్త క్రితం సంవత్సరం డిసెంబర్ లో మరణించారు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారునితో సుజాత ఈ విషయం చర్చించి, తరువాత కొత్రూడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూచా గాడ్సే గృహిణి. ఆమె భర్త ఒక బ్యాంకు ఉద్యోగి. ఇలా అరెస్టు కావడం ఈ ఘనురాలికి మొదటి సారి కాదు. ఇలాంటి మ్యాజిక్ మోసాలు చేయడం రూచాకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఒక బ్రోకర్ హోదాలో 12 మందికి ఒకే ఫ్లాట్ ను అమ్మేసిన ఘనాపాటీ ఈ వనిత. ఈ నేరంతో ఆమెపై 2006లో ఒక కేసు నమోదైంది.
News Posted: 7 January, 2010
|