శృంగారానికి 'నెట్' సెన్సార్ న్యూఢిల్లీ : భారతదేశం ఈ భూతలంపై అత్యధిక జనసాంద్రత గల దేశాలలో రెండవది కావచ్చు. కాని సెక్స్ గురించి బాహాటంగా చర్చించేందుకు లేదా సెక్స్ దృశ్యాలు చూసేందుకు భారతీయులు ఇంకా సిద్ధంగా లేరని ప్రపంచం భావిస్తున్నది. తమ వెబ్ సైట్లలో సెక్స్ సంబంధిత అంశాలు భారతదేశంలోని యూజర్లకు కంటబడకుండా నిరోధించేందుకు పలు ఇంటర్నెట్ సంస్థలు ఫిల్టర్లను అమరుస్తున్నాయి. యాహూకు చెందిన పాపులర్ ఫోటోల పంపిణీ సైట్ 'ఫ్లిక్కర్' భారతీయులు అశ్లీల దృశ్యాలు వీక్షించకుండా నివారించడానికి తన సెట్టింగ్ లను క్రితం నెల మార్చింది.
అందువల్ల, 'మీ యాహూ! ఐడి సింగపూర్, హాంకాంగ్, ఇండియా లేదా కొరియాలలో ఉండి ఉంటే ఇది (సేఫ్ సర్చ్ ప్రాముఖ్యం) వర్తించదు' అనే సందేశాన్ని ఆ సైట్ లో అటువంటి చిత్రాలకు సంబంధించిన సర్చ్ ఇప్పుడు ప్రదర్శిస్తున్నది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సర్చ్ఇంజన్ 'బ్లింగ్'లో అశ్లీల అంశాలకు సంబంధించిన సర్చ్ 'మీ దేశానికి లేదా ప్రాంతానికి కచ్చితమైన బ్లింగ్ సేఫ్ సర్చ్ సెట్టింగ్ అవసరం. పూర్తిగా వయోజనులకు ఉద్దేశించిన అంశాలను అది వడపోస్తుంది' అని సూచిస్తున్నది.
భారతదేశ 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000'లో చేసిన మార్పులకు అనుగుణంగా ఆ సైట్లు ఈవిధంగా ఫిల్టర్లు అమరుస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ చట్టం అశ్లీల సంబంధిత సమాచారం, దృశ్యాల ప్రచురణను నిషేధిస్తున్నది. సైబర్ కేఫ్ లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సర్చ్ఇంజన్లను కూడా ఈ చట్టం పరిధిలోకి క్రితం సంవత్సరం తీసుకువచ్చారు. 'అశ్లీల' సమాచారాన్ని చూడకుండా నిరోధించలేకపోతే ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా, మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారు.
అయితే, ఈ మార్పు నెట్ యూజర్లకు రుచించడం లేదు. 'ప్రభుత్వ నిబంధనల ప్రకారం అశ్లీలంగా భావించే సమాచారం అందుబాటులో లేకుండా గూగుల్ కూడా నిరోధిస్తే ఎలా ఉంటుందో ఊహించండి' అని బిపిఒ ఎగ్జిక్యూటివ్ అనూ జైన్ అన్నారు. 'మేము ఎప్పుడూ బాధ్యతతో వ్యవహరించలేమని ప్రభుత్వం భావిస్తున్నదా' అని సిడ్ కపూర్ అనే విద్యార్థి ప్రశ్నించాడు. అయితే, తెలివిమీరిన కొందరైతే ఇందుకు మార్గాంతరాలు కనుగొంటున్నారు. ఉదాహరణకు 'బ్లింగ్'లో దేశం పేరును ఇండియాకు బదులు లాట్వియా అని పేర్కొని తమ పని చక్కబెట్టుకుంటున్నారు.
News Posted: 8 January, 2010
|