3 ఇడియట్స్ కు నితీశ్ పాట్నా : పాలనా బాధ్యతలు నిర్వహించే నేతలు కూడా మానవ మాత్రులే కదా. వారికీ అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుని తమ స్నేహితులతో కలసి 'ఎంజాయ్' చేయాలనే కోరిక పుడుతుంటుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ కోవలోకే వస్తారు. ఆయన తన బిజీ దైనందిన కార్యక్రమాల నుంచి ఆదివారం 'ఆఫ్' తీసుకుని తన ఇంజనీరింగ్ కాలేజీ మిత్రులు ముగ్గురితో కలసి ఒక స్థానిక థియేటర్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం '3 ఇడియట్స్'ను వీక్షించారు.
చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆదివారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడిన నితీశ్ కుమార్ ఆ సూపర్ హిట్ చిత్రాన్ని ఎంతగానో శ్లాఘించారు. కళాశాల వాతావరణాన్ని 'సరైన రీతిలో' ప్రతిబింబింపచేసినందుకు ఆమీర్ ఖాన్, తదితరుల నటనా ప్రావీణ్యాన్ని ఆయన కొనియాడారు.
ఆతరువాత నితీశ్ కుమార్ తనకు బాగా సన్నిహితులైన కాలేజీ సహచరులను మీడియాకు పరిచయం చేస్తూ, వాస్తవానికి 'ఇంజనీరింగ్ పట్టభద్రులమైనప్పటికీ మాలో ఏ ఒక్కరూ ఇంజనీరింగ్ ను ప్రాక్టీస్ చేయడం లేదు' అని చమత్కారపూర్వకంగా చెప్పారు. 'నేను రాజకీయాలలో చేరగా నా ఇద్దరు మిత్రులు కార్పొరేట్, మీడియా ప్రపంచంలో సీనియర్ పదవులలో ఉన్నారు' అని ఆయన నవ్వుల మధ్య చెప్పారు. కాగా, జనతా దళ్ (యు) బీహార్ శాఖలో అధ్యక్షుడు లల్లన్ సింగ్ కు, ఇతర సీనియర్ నాయకులకు మధ్య కలహాలు పెరుగుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ఇలా ఉల్లాసంగా గడపడం పాట్నాలో రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
News Posted: 1 February, 2010
|