'వెజ్'కు ప్రత్యేక కిచెన్ న్యూఢిల్లీ : మీరు శాకాహారా? బయట తినడానికి ఇష్టపడుతున్నారా? అలా అయితే, 'ఏదో చేపల వాసన వస్తున్నదే' అని అనకుండానే మీరు హాయిగా భోజనం చేసే రోజు సమీపిస్తునన్నది. 'పూర్తిగా శాకాహారం అంటే అసలు సిసలైనదే' సరఫరా చేసేట్లు చూడాలని భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య (ఎఫ్ హెచ్ఆర్ఎఐ) నిర్ణయించింది. ఇదీ ఒక మార్కెటింగ్ ఎత్తుగడ అని మీరు భావించడానికి సమాఖ్య అవకాశం ఇవ్వడం లేదు. తమ తాతలు, బామ్మలు, అమ్మమ్మలతో లేదా వృద్ధులతో కలిసి వచ్చే క్లయంట్లకు రాయితీలు ఇచ్చే పథకాన్ని లోగడ ప్రకటించిన ఈ సమాఖ్య వేరే వంటవాళ్ళతో ప్రత్యేక వంటగదిలో శాకాహార పదార్థాలనే వండాలని తాను పట్టుబట్టగలనని చెబుతున్నది.
శాకాహార పదార్థాలను వేర్వేరు పాత్రలలో వండేట్లు జాగ్రత్త పడవలసిందిగా హోటళ్ళు, రెస్టారెంట్లను ఆదేశించాలని కూడా ఎఫ్ హెచ్ఆర్ఎఐ యోచిస్తున్నది. చివరకు ప్లేట్లు, కట్లరీని కూడా మాంసాహార పదార్థాలను సర్వ్ చేసినవాటితో కలపరని సమాఖ్య చెబుతున్నది. 'తమకు సర్వ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు అదే ప్లేటులో మాంసం, చేపలు సర్వ్ చేశారని ఊహించడానికే ఫక్తు శాకాహారులు భయపడుతుంటారు. 'ఫక్తు శాకాహార' పదార్థాలను తాము సర్వ్ చేస్తున్నట్లు ఏదైనా ఒక హోటల్ ప్రకటించుకుంటుంటే అది నిజంగా ఫక్తు శాకాహారమే కావాలి. అందువల్ల ఈ ఆదేశాలు ఇవ్వాలని భావించాం' అని సమాఖ్య ప్రధాన కార్యదర్శి దీపక్ శర్మ తెలియజేశారు. శాకాహార, మాంసాహార పదార్థాలు రెండింటినీ సర్వ్ చేసే రెస్టారెంట్లలో శాకాహార పదార్థాల సరఫరా కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కూడా సమాఖ్య పట్టుబట్టుతున్నదని దీపక్ శర్మ తెలిపారు.
'శాకాహారుల సంఖ్య భారీగా ఉంది. రెస్టారెంట్లు వారిని వదలుకోజాలవు. తరచు హోటళ్ళలో భోజనం చేసేవారిలో కనీసం 40 శాతం మంది పూర్తి శాకాహారులేనని మా అంచనా. అంతేకాకుండా దేశానికి వచ్చే టూరిస్టులలో అధిక సంఖ్యాకులు శాకాహారులే' అని ఆయన చెప్పారు. నవరాత్రి వంటి మతపరమైన పండుగలలో హోటళ్ళలో భోజనం చేసే శాకాహారుల సంఖ్య పెరిగిందని, ఇది ఒక్కొక్కసారి 70 శాతం వరకు పెరుగుతున్నదని హోటల్, రెస్టారెంట్ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కొత్త ఆదేశాలను పాటించే హోటళ్ళకు ప్రత్యేక గ్రేడ్ ను కేటాయించాలని సమాఖ్య యోచిస్తున్నదని దీపక్ శర్మ తెలియజేశారు. అయితే, ఈ మార్గదర్శకసూత్రాలు అమలును తప్పనిసరి చేయబోమని ఆయన చెప్పారు.
News Posted: 2 February, 2010
|