బాకీకు బదులు కుడిచేయి లక్నో : కేవలం ఆరు వందల రూపాయలు అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తి కుడి చేతిని నరికేశారు. ఈ దుర్మార్గం ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలోని కచౌనా లో జరిగింది. లక్నోకి 120 కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ పట్టణంలో 20 ఏళ్ల భాయ్ యాలాల్ కార్మికుడుగా పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఒకసారి డబ్బు అవసరం పడటంతో లాల్ ఏడు వేల రూపాయలను స్థానిక వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేసాడు. కొంత డబ్బును సక్రమంగానే చెల్లించిన లాల్ ఇంకా కొంత మొత్తాన్ని, వడ్డీని బకాయిపడ్డాడు. ఈ బాకీ కోసం వడ్డీ వ్యాపారుల నుండి పదే పదే ఒత్తిడి పెరిగింది. దీంతో లాల్ వారిని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. గత ఆరు నెలల కాలంగా వారికి చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. గత ఆదివారం మాత్రం లాల్ కు అదృష్టం ముఖం చాటేసింది. అప్పు ఇచ్చిన వ్యాపారికి చెందిన నలుగురు రౌడీలకు దొరకిపోయాడు. తీసుకున్న అప్పు, దానిపై వడ్డీ చెల్లించాలంటూ వారు లాల్ పై దౌర్జన్యం చేసారు. డబ్బు తిరిగి చెల్లించడానికి తనకు మరింత సమయం ఇవ్వాలంటూ వారిని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. చెల్లించవలసిన బాకీకి బదులుగా వాళ్ళు లాల్ కుడి చేతిని నరికేసారు. లాల్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. లాల్ చేతిని నరికిన దుర్మార్గులు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసు ఇన్ స్పెక్టర్ విద్యా సాగర్ వెల్లడించారు.
News Posted: 9 February, 2010
|