లవ్ బ్యాంక్! చెన్నై : 'పదిలమైన' ప్రేమ కోసం ప్రత్యేకంగా 'లవ్ బ్యాంక్' ఒకటి ఆవిర్భవిస్తోంది. ఆదివారం ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) జరగనున్న సందర్భంగా శనివారం చెన్నైలో ఈ బ్యాంకుకు శ్రీకారం చుడుతున్నారు. ఇటువంటి ప్రయత్నం జరగడం దేశంలో ఇదే మొదటిసారి. కాపురంలో కలతలు తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ 'లవ్ బ్యాంక్' ను ఐదవ అంతర్జాతీయ సెక్సాలజీ సదస్సులో ప్రారంభించనున్నట్లు చెన్నైలోని ఆకాశ్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ టి. కామరాజ్ శుక్రవారం విలేఖరులకు తెలియజేశారు.
ప్రధానంగా దంపతుల మధ్య పరస్పరానుబంధం లేమి కారణంగా కాపురంలో కలతలు ఏర్పడుతున్నాయని డాక్టర్ కామరాజ్ చెబుతూ, పెరిగిపోతున్న విడాకుల సంఖ్యను కూడా తగ్గించడం ఈ వినూత్న ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రేమికుల రోజు వేడుకలు జరుపుకోవడం అంతకంతకూ అధికం అవుతున్నప్పటికీ విడాకుల రేటు గణనీయంగా పెరిగిపోతుండడం సమాజాన్ని కలవరపరుస్తున్నదని ఆయన చెప్పారు. 'లవ్ బ్యాంక్' లక్ష్యం దంపతులు తమ జీవితాంతం ప్రేమాభిమానాలతో కాలం గడిపేట్లు చూడడమేనని ఆయన చెప్పారు.
'పెళ్లయిన కొన్ని మాసాలకే దంపతుల మధ్య ప్రేమ తగ్గిపోవడం విడాకులకు ప్రధాన కారణం' అని డాక్టర్ కామరాజ్ పేర్కొన్నారు. దంపతులు తమ జీవితాంతం 'ప్రేమికుల వలె' కాలం గడిపే విధంగా లవ్ బ్యాంక్ కౌన్సెలింగ్ సెషన్లు, నెల నెలా తరగతులు నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు. జీవిత భాగస్వామి మనస్సును నొప్పించకపోవడం, ప్రేమాభిమానాలు కురిపించడం, నిజాయితీగా వ్యవహరించడం, పరస్పర అంగీకారంతో నిర్ణయాలు తీసుకోవడం, శాశ్వత అనుబంధాన్ని కలిగి ఉండడానికై (వివాహానికి ముందు ప్రేమికులుగా ఆనందాన్ని అనుభవించినట్లుగా) వివాహానంతరం వారానికి 15 గంటల పాటు ప్రేమికుల వలె కాలం గడపడం ప్రేమను శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి కొన్ని సూత్రాలని డాక్టర్ కామరాజ్ చెప్పారు.
'రెండు రోజుల సెక్సాలజీ సదస్సుకు హాజరయ్యే 500 మంది ప్రతినిధులు అందరినీ ఇందులో భాగస్థులను చేయాలని యోచిస్తున్నాం. నిజమైన ప్రేమ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పేందుకై రానున్న ఒక సంవత్సరంలో ప్రేమికులు, దంపతులు, వృద్ధ దంపతులతో సహా మరి 5000 మందిని చేర్చుకోవాలన్నది మా లక్ష్యం' అని డాక్టర్ కామరాజ్ తెలిపారు.
కాగా, వెండి తెరపై అన్యోన్యతను వాస్తవ జీవితానికీ విస్తరించుకున్న సూర్య, జ్యోతిక వంటి సుప్రసిద్ధ సినీ దంపతులు ఈ 'లవ్ బ్యాంక్' ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
News Posted: 13 February, 2010
|