ఒక రాత్రి ఖరీదు 60 వేలు!
చండీగఢ్ : ఒక రాత్రికి 60 వేల రూపాయలు! ఆదివారం చండీగఢ్ జాగిలాల ప్రదర్శనలో పాల్గొన్న ఒక అరుదైన మేలుజాతి శునకం సంపర్కం కోసం వసూలుచేసే మొత్తం అది. ఈ న్యూఫౌండ్ లాండ్ జాతి శునకం హర్యానాలోని కర్నాల్ లో ఒక శునక ప్రేమికుని ఆస్తి. అరుదైన, సౌష్టవంగా ఉంటుంది కనుక దీనికి అంత రేటు పలుకుతున్నది. కెనడాలోని ఒక దీవి న్యూఫౌండ్ లాండ్.
ఒక ఎలుగుబంటిలా కనిపించే ఈ శునకం 'టీన్', దీని ఆడ తోడు 'బెబో' ఈ డాగ్ షోలో అందరి దృష్టినీ ఆకర్షించాయి. కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చండీగఢ్ కెన్నెల్ క్లబ్ ఈ షోను నిర్వహించింది. ఈ జంటకు ఓవరాల్ ట్రోఫీ లభించింది. రాకేశ్ వర్మ ఈ రెండింటినీ, ఇదే జాతికి చెందిన మరొక చూడి శునకాన్ని యుకె నుంచి తీసుకువచ్చారు. అయితే, మేటింగ్ ప్రారంభించేందుకు అంతర్జాతీయ కెన్నెల క్లబ్ సూచించిన వయస్సుకు టీన్ ఇప్పుడే వచ్చింది. డాగ్ షోలో పాల్గొనేందుకు కర్నాల్ నుంచి ప్రత్యేకంగా ఈ శునకాలను తీసుకువచ్చిన రాకేశ్ వర్మ టీన్ తో మేటింగ్ కోసం 60 వేల రూపాయల రేటును తాను నిర్ణయించానని, అసలు సిసలు పెంపకందారులనే అనుమతిస్తున్నానని తెలియజేశారు. టీన్ ఒక చాంపియన్ కుటుంబానికి చెందినది. ఇది దేశవ్యాప్తంగా పలు డాగ్ షోలలో విజయాలు సాధించింది.
టీన్, బెబో పిల్లలు కూడా అధిక మొత్తాలు రాబట్టుతున్నాయి. 'కుక్క పిల్లలు అమ్ముడుపోయే రేటుకు సమానమైన మొత్తాన్ని శునక యజమానులు మేటింగ్ కు వసూలు చేస్తుంటారు. అయితే, న్యూఫౌండ్ లాండ్ కుక్క పిల్లలు లక్ష రూపాయల వరకు రాబట్టుతుంటాయి కనుక మేము సరసమైన స్థాయిలో 60 వేల రూపాయలను మేటింగ్ మొత్తంగా నిర్ణయించాం' అని వర్మ చెప్పారు. 'నాకు పెంపుడు జంతువులపై అభిమానం మెండు. దానిని ఇప్పుడు వృత్తిగా మార్చుకుని, నా కోసం డబ్బు సంపాదిస్తున్నాను' అని ఆయన తెలిపారు.
న్యూఫౌండ్ లాండ్ జాతి శునకాలు ఏ ఇతర జాతి కన్నా బలిష్టమైనవిగా పరిగణిస్తున్నారు. ఇవి గ్రేట్ డేన్, మాస్టిఫ్ లేదా ఐరిష్ వుల్ఫ్ హౌండ్ లక్షణాలు కొన్నిటిని కూడా తోసిరాజంటున్నాయి. వీటిని కెనడా న్యూఫౌండ్ లాండ్ లో మత్స్యకారులకు సాయం కోసం ఉపయోగిస్తున్నారు. 'జెంటిల్ జయంట్'గా పేర్కొనే ఈ జాతి శునకాలకు అపార బలం, విధేయత ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పాపులర్ శునకాలు ఎక్కువగా నలుపు రంగులో ఉంటాయి. 70 నుంచి 120 కిలోల బరువు ఉంటాయి. ముక్కు నుంచి తోక వరకు ఇవి ఆరడుగుల పొడవు ఉంటాయి.
News Posted: 15 February, 2010
|