కేరళలో పుట్టిన 'హస్తం'?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 'హస్తం' గుర్తుకు మూలస్థానం కేరళలోని ఒక మారుమూల దేవాలయమేనా? పార్టీకి ఆ గుర్తు ఎలా వచ్చిందో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులు కచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ పాలక్కాడ్ జిల్లాలో ఎమూరు భగవతి (హేమాంబిక) ఆలయం సిబ్బంది చెబుతున్న సమాచారం ప్రకారం, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ ఆలయలోని ప్రధాన దేవత నుంచే స్ఫూర్తి పొందారు. దేవి 'హస్తాలే' విగ్రహాలుగా ఉన్న ఆలయం దేశంలో ఇది ఒక్కటేనని విశ్వాసం. ఆలయాన్ని కూడా 'కైపతి' (హస్తం) ఆలయం అని పేర్కొంటుంటారు.
హేమాంబిక ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారి, పాలక్కాడ్ కు చెందిన వి. మురళీధర మాట్లాడుతూ, స్థల పురాణం ప్రకారం, హేమాంబిక దేవి స్వయంగా ఒక సరస్సులో అవతరించింది. సౌభాగ్యదాయిని, వరప్రదాయిని, శుభదాయిని అయిన మాత కళ్ళెకుళం సరస్సు మధ్యలో తన పవిత్ర హస్తాలను పైకి లేపింది. ఆమె భక్తుడైన పూజారి భక్తితో కూడిన ఉద్వేగంతో, దేవి పూర్తిగా అవతరించేంత వరకు ఆగలేక, సరస్సులోకి దూకి ఆ చేతులను పట్టుకున్నాడు. దానితో దేవి తన అవతరణను నిలిపివేసింది. దీంతో సరస్సులోంచి లేచిన దేవి హస్తాలు మాత్రమే పూజారికి దక్కాయి. ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన చేతులే అవి' అని తెలియజేశారు. 'ఆలయానికి వచ్చి దేవిని దర్శించుకున్న ప్రముఖులలో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ ఒకరు. ఆ తదుపరి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె హస్తంను గుర్తుగా ఎంచుకున్నారు' అని మురళీధర తెలిపారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 18 March, 2009
|