లేడీ బాస్ తో పెళ్ళి
అహ్మదాబాద్ : కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. కానీ గుజరాత్ కు చెందిన ఓ యువకుడికి ఏకంగా తను పనిచేస్తున్న కంపెనీ లేడీ బాసే పరిణయమాడతానంటూ వచ్చేసింది. కేవలం సనిమాల్లోనే కనిపించే ఇలాంటి సంఘటన నిజజీవితంలో జరగడం అత్యంత అరుదు. ఆస్ట్రియాలో వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న 35 ఏళ్ల అనంగ్ నాయక్ అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయింది. తను పనిచేస్తున్న లారస్ అనే కంపెనీ యజమానురాలైన డోరిస్ తనకు భార్య కారవడం తన అదృష్టమని అనంగ్ నాయక్ ఎంతగా సబరపడిపోతున్నాడో, భారత ఆడపడుచుగా రావడం తనకెంతో ఆనందంగా ఉందని, చీరకట్టుకుని చపాతీలు వత్తుతూ గుజరాతీ తరహాలో వంటలు చేయడం తనకు కొత్త అనుభూతిని ఇస్తోందని డోరిస్ కూడా మురిసిపోతోంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా వాస్తవంగా జరిగిన ఈ సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి.
ఆస్ట్రియాలో ఉద్యోగం కోసం వెళ్లిన అనంగ్ నాయక్ కు అక్కడి లారస్ అనే కంపెనీలో వైద్యశాస్త్ర వేత్తగా పని దొరికింది. ఎలాగూ ఉద్యోగం దొరికింది కదా అనుకుని ఇంటి దగ్గరి నుంచి పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. వృద్ధులైన తల్లిదండ్రుల కోరిక మన్నించి పెళ్ళి చేసుకునేందుకు సెలవుపై గుజరాత్ వచ్చాడు.ఇక ఎలాగూ వచ్చాడు కదా అని తల్లిదండ్రులు ఎలాగైనా పెళ్ళిచేసేద్దామనే పట్టుదలతో మరింత ఒత్తిడి చేశారు. దాంతో సెలవును పొడిగించాల్సి వచ్చింది. ఆస్ట్రియాలోని తన కార్యాలయానికి ఫోన్ చేసి సెలవు పొడిగించాలని అభ్యర్థించాడు. వెంటనే అతడికి అత్యవసర మెయిల్ ఏకంగా బాస్ నుంచే వచ్చింది. `నన్ను పెళ్ళి చేసుకోవడం నీకేమైనా అభ్యంతరమా?' అన్నది ఆ మెయిల్ సారాంశం. అంతే అతడి ఆనందానికి అవధులే లేవు. అనంగ్ నాయక్ సరే అనడంతో గుజరాత్ వచ్చిన డోరిస్ ఈ నెల 6న అతడ్ని పెళ్ళాడింది. తాను తెగించి పెళ్ళి ప్రతిపాదన చేయకపోతే తనకు అనంగ్ తో పెళ్ళి అయ్యే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయాన్ని ఈ ఆస్ట్రియా వనిత వ్యక్తం చేసింది.
Pages: 1 -2- News Posted: 13 June, 2009
|