లేడీ బాస్ తో పెళ్ళి
గతంలోకూడా కొన్ని సార్లు అనంగ్ నాయక్ గుజరాత్ వచ్చినా ఈసారి జరిగినంతగా పెళ్లి విషయంలో అతడిపై తల్లిదండ్రుల ఒత్తిడి పెరగలేదు. ఇంటి కోడల్ని తీసుకువస్తే తప్ప ఆస్ట్రియా తిరిగి వెళ్ళడానికి వీలులేదంటూ ఈసారి పట్టుబట్టారు. ఆ ఒత్తిడిలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్ట్రియాలోని తన బాస్ కు ఫోన్ చేయడం, ఆమే కోడలిగా ఇంట్లో అడుగుపెట్టడం ఓ కల నిజమైనట్లుగా జరిగిపోయింది. డోరిస్ కు, తనకు మధ్య భావాల్లోనూ, అభిప్రాయాల్లోనూ, అలవాట్లలోనూ ఎంతో సారూప్యత ఉందని, ముఖ్యంగా ఇద్దరం శాఖాహారులమేనని అనంగ్ నాయక్ చెబుతున్నాడు.
తాను ఆమె కంపెనీలో పనిచేశానే తప్ప ఆమెకు తన పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఎప్పుడూ గమనించలేదని, తన పని తాను చేసుకుపోయేవాడినని అనంగ్ తెలిపాడు. ఇక డోరిస్ కూడా తన మనసులోని మాటను దాచుకోకుండానే వెల్లడించింది. అనంగ్ నాయక్ తో మాట్లాడినప్పుడు కానీ, అతనితో కలిసి ఉన్నప్పుడు కానీ తానెప్పుడూ ఇబ్బంది పడలేదని, పైగా ప్రతి చిన్న విషయానికి అతడు ప్రతిస్పందించే తీరు, ముఖ్యంగా నిజాయితీ తనకెంతో నచ్చాయని ప్రశంసాపూర్వకంగా వెల్లడించింది. మొత్తానికి తమ మాట కాదనకుండా ఆస్ట్రియా వెళ్ళడానికి ముందే తమ కుమారుడు కోడల్ని తేవడం అనంగ్ నాయక్ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే తాను కూడా ఓ పెద్ద కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టడం ఎంతో హాయిగా ఉందని డోరిస్ చెబుతోంది.
Pages: -1- 2 News Posted: 13 June, 2009
|