మహిళా సిఇఒలే టాప్ ముంబై : పురుషులకు మాత్రమే ప్రత్యేకమైనవిగా భావిస్తున్న రంగాలలోకి కొందరు మహిళలు ప్రవేశించి తమకు అసాధ్యమైనదేమీ లేదంటూ తమ సత్తా చాటుతున్నారు. 2009 సంవత్సరంలో ఆర్థిక రంగంలో, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మహిళలు విశేషంగా రాణించారు. ఆయా సంస్థలో అత్యున్నత పదవులను అధిష్ఠించిన ఆ మహిళలు మిట్టపల్లాల మీదుగా నడక సాగించవలసి వచ్చింది. ఆర్థిక సంక్షోభం రూపంలో వ్యతిరేక పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఢక్కామొక్కీలు తిన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ లకు కూడా ఆ సంక్షోభాన్ని అధిగమించడం కష్టం అనిపించింది. ప్రపంచాన్ని అకస్మాత్తుగా కుదిపివేయసాగిన ఆ సంక్షోభాన్ని తట్టుకోలేక తప్పుకున్న ఉన్నత స్థాయి అధికారులు ఎందరో ఉన్నారు. అయితే, దేశంలోని ఆర్థిక సంస్థలకు సారథ్యం వహిస్తున్న మహిళలు చెక్కుచెదరకుండా సాగిపోయారు.
తమ బ్యాంకులను నమ్మిన జనం చేసిన కోట్లాది రూపాయల డిపాజిట్లను పరిరక్షించవలసిన బాధ్యతను భుజానికి ఎత్తుకున్న ఆ మహిళా అధికారులు బ్యాంకింగ్ విధులను సాఫీగా నిర్వర్తించవలసి రావడమే కాకుండా బడా సంస్థల పతనం ప్రభావం తమ బ్యాంకులపై పడకుండా జాగ్రత్త పడవలసి వచ్చింది కూడా. ఈ సంక్షోభం పరాకాష్ఠను చేరుకున్న సమయంలో ఐసిఐసిఐ బ్యాంకు తమ పాత కాపు చందా కోచ్చర్ నే నమ్ముకున్నది. కోచ్చర్ మేనేజ్ మెంట్ ట్రెయినీగా ఈ ప్రైవేట్ రంగ బ్యాంకులో చేరారు. ఆతరువాత ఆమె తమ బ్యాంకు ప్రధాన పథకాలు చేపట్టినప్పుడల్లా వాటికి ఆధ్వర్యం వహించారు. రెండు దశాబ్దాలకు పైగా విజయవంతంగా బ్యాంకుకు సేవలు అందించిన తరువాత ఆమె ఇప్పుడు బ్యాంకు సర్వోన్నత అధికారిగా వ్యవహరిస్తున్నారు.
చందా కోచ్చర్ ఐసిఐసిఐ బ్యాంకు పగ్గాలు చేపట్టగా, ఆమె సహచరురాలు శిఖా శర్మ ఏక్సిస్ బ్యాంకులో చేరారు. శిఖా శర్మ పలు సంస్థలకు సారథ్యం వహించారు. అవి ఇప్పుడు బడా వాణిజ్య సంస్థలుగా వృద్ధి చెందాయి. దేశంలోని ఇతర ఆర్థిక సహాయ సంస్థలలో జెపి మోర్గాన్ కు కల్పనా మొర్పారియా, హెచ్ఎస్ బిసికి నైనా లాల్ కిద్వాయి, ఎబిఎన్ ఆమ్రోకు మీరా సన్యాల్ సారథ్యం వహిస్తున్నారు.
ఇంతకుముందు న్యాయవాది, ఇప్పుడు సిఇఒ అయిన కల్పనా మొర్పారియా ఐసిఐసిఐ బ్యాంకులో నుంచి రిటైరైన అనంతరం జెపి మోర్గాన్ తో తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆర్థిక మాంద్యం సమయంలో మొర్పారియా ఈ బాధ్యతలు స్వీకరించారు. కొన్ని నెలలలోనే ఆమె టాటా పవర్, టాటా స్టీల్ వంటి కార్పొరేట్ సంస్థల విదేశీ ఈక్విటీ ఇష్యూలు పెక్కింటిని దక్కించుకోవడంలో తమ బ్యాంకుకు తోడ్పడ్డారు.
Pages: 1 -2- News Posted: 1 January, 2010
|