టైటన్ చక్కని సవాల్
1990 దశకం ఆరంభంలో ఈ సంస్థకు తన ఉత్పత్తుల విభాగంలో ఆభరణాలను చేర్చాలనే ఆలోచన వచ్చింది. వాచీల విషయంలో వలె మార్కెట్ ధోరణులకు భిన్నంగా సాగాలని నిశ్చయించుకుని 1994లో నగల వ్యాపారంలోకి ప్రవేశించింది. బంగారు ఆభరణాలదే ఆధిపత్యం అయిన మార్కెట్ లోకి ఈ సంస్థ యూరోపియన్ శైలి వజ్రాల ఆభరణాలతో ప్రవేశించింది. అయితే, ఈ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 'ఆర్జన చాలా తక్కువగా ఉండేది. మా అత్యున్నత స్థాయి ఆఫర్లతోను, రీటైల్ షోరూమ్ లతోను మేము తంటాలు పడవలసి వచ్చింది' అని టైటన్ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (ఆభరణాలు) సి.కె. వెంకట్రామన్ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే సంస్థ బంగారు ఆభరణాలను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.
టైటన్ కు ప్రధాన పోటీదారులు స్థానిక నగల వర్తకులే. వారు తమ వ్యాపారంలో ఎంతగా విజయం సాధిస్తున్నప్పటికీ, తాము చెప్పిన స్థాయి కన్నా తక్కువ స్థాయిలో బంగారాన్ని అమ్ముతూ జనాన్ని మోసం చేస్తున్నారని అనుమానిస్తుండేవారు. బంగారం శ్రేష్ఠతను కొలిచేందుకు పక్కా పరికరం క్యారట్ మీటర్ ను టైటన్ ప్రవేశపెట్టిందని, దీని వల్ల తమ బ్రాండ్ పై కొనుగోలుదారుల నమ్మకాన్ని పొందగలిగామని వెంకటరామన్ తెలిపారు.
టైటన్ విజయానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటని బ్రాండ్ వ్యూహ నిపుణుడు హరీష్ బిజూర్ పేర్కొన్నారు. 'దుర్వినియోగానికి అవకాశాలు మెండుగా ఉన్న కేటగరీలలోకి టైటన్ ప్రవేశించింది. జ్యూయెలర్లను కస్టమర్లు విశ్వసించని సమయంలో సంస్థ నగల రంగంలోకి ప్రవేశించింది. అదేవిధంగా ఆఫ్తమాలజిస్టులను వినియోగదారులు విశ్వసించని సమయంలో సంస్థ కళ్లజోళ్ల రంగంలోకి ప్రవేశించింది. వినియోగదారులు కోరుకుంటున్నదేమిటో ఊహించడంలో వారి కన్నా సంస్థ రెండడుగులు ముందే ఉంటున్నది. అదే సంస్థకు గొప్ప బలం' అని బిజూర్ పేర్కొన్నారు.
క్యారట్ మీటర్ తో సద్భావన పొందడంతో ఆభరణాల విభాగం 2000 - 01 సంవత్సరంలో మొదటిసారిగా లాభం చవిచూసింది. ఆ తదుపరి ఐదు సంవత్సరాలలో సంస్థ సుమారు 30 తనిష్క్ స్టోర్స్ ను, ఆర్య, దివా వంటి కొత్త కలెక్షన్లను ప్రారంభించింది. తదనంతరం 2004లో కలర్స్ వంటి పాపులర్ కలెక్షన్లను, హిందీ చిత్రాల ప్రేరణతో కొత్త కలెక్షన్లను ప్రవేశపెట్టింది. తనిష్క్ కు ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ, టైర్ 2, 3 నగరాలలో స్థానిక జ్యూయెలర్లు తమ సాంప్రదాయక బంగారం ఆభరణాలతో ఆధిపత్యం వహిస్తూనే ఉన్నారని టైటన్ గ్రహించింది. అందుకే ఈ సంస్థ తన రెండవ ప్రధాన బ్రాండ్ 'గోల్డ్ ప్లస్'ను 2005లో ప్రారంభించింది. ఇందులో 90 శాతం వరకు బంగారం ఉంటుంది. 'చిన్న నగరాలు, పట్టణాలలో బంగారం ఆభరణంగా కన్నా పెట్టుబడిగానే ఎక్కువ పరిగణన పొందుతుంటుంది. ధర విషయాన్ని కూడా ఎక్కువ పట్టించుకుంటుంటారు. స్థానిక జ్యూయెలర్ వలె మేము ధర ఉండేట్లు చూశాం' అని వెంకటరామన్ వివరించారు. ఈ సంస్థ మరొకవైపు సంపన్నుల కోసం 'జోయా' పేరిట అత్యున్నత శ్రేణి నగల ఆఫర్లను ప్రారంభించింది. వీటిలో సుమారు 75 శాతం వజ్రాలతో కూడుకున్నవే.
Pages: -1- 2 -3- News Posted: 22 February, 2010
|