సమష్టి కృషితో సత్ఫలితం
(వేముల సదానందం)
వరంగల్ : సహోద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే వరంగల్ రెవెన్యూ డివిజన్ లో సత్ఫలితాలు సాధించగలిగినట్లు బదిలీపై వెళ్ళిన ఆర్డీవో వి.ఎల్. సురేందర్ కరణ్ అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇటీవలే బదిలీపై వెళ్ళిన ఆయనకు ఆదివారంనాడు వరంగల్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణం అని ఈ సందర్భంగా సురేందర్ కరణ్ అన్నారు. రెండేళ్ళ 10 నెలల పాటు వరంగల్ ఆర్డీవోగా పనిచేసిన కాలంలో పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, హన్మకొండ, వరంగల్ లోక్ సభ, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహోద్యోగులు ఎంతో సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్డీవోగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ మాట్లాడుతూ, సురేందర్ కరణ్ తో తనకు విద్యాభ్యాస కాలం నుంచే అనుబంధం ఉందని చెప్పారు. తామిద్దరం ఒకే జిల్లా ఒకే ఊరు, ఒకే వీధికి చెందిన వారమని, సురేందర్ కరణ్ తనకు సీనియర్ గా, అన్నలా అన్ని విధాలా సహకారం అందించారన్నారు. టిఎన్ జివో అసోసియేషన్ అధ్యక్షుడు పి. సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు కె. రవీందర్ రెడ్డి, నాగయ్య, చంద్రశేఖర్, ఆత్మకూర్ మాజీ ఎమ్మార్వో లత, ప్రొబేషనరీ ఆర్డీవో అంబేద్కర్ తదితరులు మాట్లాడారు.
ఈ వీడ్కోలు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, హన్మకొండ మాజీ ఎమ్మార్వో ఎం. నాగయ్య అధ్యక్షత వహించారు. వరంగల్ కొత్త ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన బద్రి శ్రీనివాస్, టిఎన్ జివోల సంఘం అధ్యక్షుడు పి. సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు కె. రవీందర్ రెడ్డి, ప్రొబేషనరీ ఆర్డీవో అంబేద్కర్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రాజమల్లయ్ల అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మార్వోలు మహేందర్ రెడ్డి, నర్సయ్య, కుమారస్వామి, ఫణిందర్, రాజిరెడ్డి, పరంజ్యోతి, విశ్వం తదితరులు కూడా మాట్లాడారు.
News Posted: 2 March, 2009
|