ఎన్నికల ఫిర్యాదుకు టోల్ ఫ్రీ
(వేముల సదానందం)
వరంగల్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినవారిపై ఫిర్యాదు చేయడానికి వీలుగా 1100 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదును సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియపరుస్తామన్నారు. ఇదే విషయాన్ని ఫిర్యాదుదారునికి కూడా తెలియజేస్తామన్నారు. వోటర్ల జాబితాలో వోటర్లందరి ఫొటోలు ఉండేలా కృషి చేయాలని సుబ్బారావు సూచించారు. ఎలక్ట్రానిక్ ఫొటో గుర్తింపు కార్డులు జారీ, పంపిణీ చేయాలని సుబ్బారావు ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ప్రకాశ్ మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక వీడియో బృందం ఏర్పాటు చేసుకొని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారి వివరాలు సేకరించాలని, వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో జరిగే ఉల్లంఘనలకు సంబంధించి దినపత్రికలలో ప్రచురించిన క్లిప్పింగ్ లను హైదరాబాద్ పంపించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ బి. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని భూపాలపల్లి, వరంగల్ నియోజకవర్గాల పరిధిలో ముగ్గురు సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం కలెక్టర్ తహసిల్దార్లను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ వి. కరుణ, జిల్లా ఆర్డీవో శ్రీరాంరెడ్డి, ఐటిడిఏ పిఓ సుందర అబ్నార్,ములుగు సబ్ కలెక్టర్ సుర్ణ పాండు దాస్, వరంగల్, నర్సంపేట, జనగాం, మహబూబాబాద్ ఆర్డీవోలు, అన్ని మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.
News Posted: 2 March, 2009
|