'పత్తి రైతులూ పరేషాన్ వద్దు'
(వేముల సదానందం)
వరంగల్ : వ్యవసాయ మార్కెట్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైతుల నుంచి నాణ్యమైన పత్తిని కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ద్వార చర్యలు తీసుకున్నామని, ఎలాంటి ఆందోళనా చెందవద్దని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పంకజ్ ద్వివేది అన్నారు. సోమవారంనాడు ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి పత్తి కొనుగోలు జరుగుతున్న తీరును, పత్తి నాణ్యతను, తేమ శాతాన్ని, మద్దతు ధరను పరిశీలించారు. రైతులు మార్కెట్ కు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధర పొందాలని, ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు సహకరించాలని సూచించారు.
అనంతరం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించి సూచనలు చేశారు. పత్తి లోడ్ తో మార్కెట్ కు వచ్చిన వాహనాలను వెంటనే తూకం వేయించి కొనుగోలు జరిగే ప్రదేశానికి పంపించాలన్నారు. 2008 - 09 సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 2008 నుంచి ఫిబ్రవరి 2009 వరకూ వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు మొత్తం 15 లక్షల 424 క్వింటాళ్ళ పత్తిని రైతులు తీసుకు రాగా, సిసిఐ ద్వారా 13,21,200 క్వింటాళ్ళ పత్తిని కొనుగోలు చేసి రైతులకు ప్రయోజనం కలిగించినట్లు చెప్పారు. పత్తి కొనుగోలు సందర్భంగా తలెత్తిన వివాదాలను కలెక్టర్ జనార్దన్ రెడ్డి సమర్థంగా పరిష్కరించారని పంకజ్ ద్వివేది అభినందించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ టి. రమేశ్ బాబు, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మార్కెట్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 3 March, 2009
|