మావోయిస్టు డంప్ స్వాధీనం
(వేముల సదానందం)
వరంగల్ : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో సిపిఐ(ఎం.ఎల్) మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఆయుధాల డంప్ ను వరంగల్ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. గెరిల్లా యుద్ధం చేసేందుకే మావోయిస్టులు ఈ డంప్ ను ఏర్పాటు చేసి ఉండవచ్చని జిల్లా ఎస్పీ సజ్జన్నార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఏటూర్ నాగారం, తాడ్వాయి, మంగపేట, కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు తుపాకులు, మందుపాతరలు, క్లేమోర్ మైన్ లు, పేలుడు పదార్థాలతో కూడిన సామగ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములలో పాతిపెట్టారని వాటిని ఆయా ప్రాంతాల ఎస్సైలు కనుగొని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు.
మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాలుగు డంప్ లలో రెండు 30 కార్బన్ తుపాకులు మ్యాగ్జైన్లతో సహా, ఒక 410 మస్కట్, మూడు రివాల్వర్లు, మూడు 9 ఎంఎం పిస్టళ్ళు, ఒక 8 ఎంఎం తపంచా, ఒక 8ఎంఎం రైఫిల్, 10 ల్యాండ్ మైన్స్, ఒక క్లైమోర్ మైన, 18.5 కిలోల జిలెటిన్స 972 డిటోనేటర్లు, నాలుగు కెమెరా ఫ్లాష్ లు, ఒక రేడియో, రెండు గడియారాలు, మూడు మీటర్ల ఎర్రబట్ట, మూడు గ్రైనేడ్లు, ఎస్.ఎల్.ఆర్, 9ఎంఎం, 303, డిబిబిఎల్ లకు చెందిన 280 తూటాలు, నాలుగు వైర్ బండిళ్లు, ఒక ఎక్స్ ప్లోడర్, రెండు కప్లింగ్ బాంబులు, మావోయిస్టు సాహిత్యం పుస్తకాలు, 8 ఎలక్ట్రికల్ స్విచ్ లు, ఒక మెడికల్ కిట్ 388 జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వివరించారు.
వరంగల్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా గాలించినట్లు ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లాలో 271 సమస్యాత్మక గ్రామాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 15 నుంచి 20 మంది దళ సభ్యులతో కూడిన కెకెడబ్ల్యు కమిటీ జిల్లాలో సంచరిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని ఎస్పీ చెప్పారు. ఎన్నికలు బూటకం అంటూ బహిష్కరణ పిలుపునిచ్చిన మావోయిస్టులు ఈ డంప్ లను ఏర్పాటు చేసినట్లు సజ్జన్నార్ తెలిపారు. మావోయిస్టుల కదలికల కారణంగా వారి టార్గెట్ గా ఉన్న రాజకీయ నాయకులకు భద్రత మరింతగా పెంచామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఒఎస్ డి క్రాంతి రాణా తాతా, ట్రైనీ ఐపీఎస్ నితిన్ తివారి, దక్షిణామూర్తి, తిరుపతి తదితరులు ఉన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని ఈ మీడియా సమావేశంలో ఎస్పీ ప్రదర్శించారు.
News Posted: 13 March, 2009
|