సారాపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో అక్రమ సారా, గుడుంబా తయారీని నిరోధించేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన గురువారంనాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సజ్జన్నార్, జాయింట్ కలెక్టర్ వి. కరుణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, విలేజ్ సర్వెంట్, ఒక కానిస్టేబుల్ సభ్యలుగా ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి జిల్లాలో సీనియర్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సెల్ నెంబర్ 9849903660, జిల్లా పంచాయతీ అధికారి సెల్ నెంబర్ 9849902178, డిఆర్ డిఎ ఎపిడి సెల్ నెంబర్లకు 9849993517 ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి, ఉద్యోగి రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళకూడదని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచారం కోసం వాల్ రైటింగ్ చేస్తే తప్పనిసరిగా సంబంధిత యజమాని నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. 108 అంబులెన్స్ వాహనంపై రాజీవ్ గాంధీ చిత్రాన్ని తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల సభల కోసం ప్రజలను లారీలు, ట్రాక్టర్లలో తరలించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అతిథిగృహాలను రాజకీయ నాయకులకు ఇవ్వరాదని చెప్పారు. సమావేశంలో ఎస్పీ, జెసితో పాటు డిఆర్ ఓ శ్రీరాంరెడ్డి, సిఎఫ్, మల్హాసి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీధర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News Posted: 13 March, 2009
|