నర్సింగా రెడ్డి నామినేషన్
(వేముల సదానందం)
వరంగల్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిథుల శాసన మండలి ఎన్నికల్లో మహాకూటమి బలపరచిన టిడిపి అభ్యర్థిగా డా.నర్సింగారెడ్డి నామినేషన్ ధాఖలు చేశారు. మహాకూటిమి నేతలు వెంటరాగా నర్సింగారెడ్డి నామినేషన్ పత్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ వి.కరుణకు అందజేశారు. నామినేషన్ సమయంలో ఐదుగురు సభ్యులను మాత్రమే లోపలికి అనుమతించడంతో మిగతా నేతలంతా గేటు వెలుపల ఉండిపోయారు. నర్సింగారెడ్డితో పాటు టిడిపి అధ్యక్షులు రావూరి ప్రకాష్ రెడ్డి, టిఆర్ఎస్ తరఫున కె.రాజయ్య యాదవ్, సిపిఎం నుండి శ్రీనివాసరావు, సిపిఐ నుండి కృష్ణారెడ్డిలు నామినేషన్ ధాఖలు చేసిన సమయంలో వెంట ఉన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ఈ శాసన మండలి ఎన్నికలు మంచీ, చెడులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. మహాకూటమి మద్దతుతో బరిలోకి దిగిన నర్సింగారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. నర్సింగారెడ్డి మాట్లాడుతూ మహాకూటమి తనకు పూర్తి మద్ధతు కల్పించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయన కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నరేందర్ రెడ్డి, ఎన్.సుధాకర్ రెడ్డి, గుండు సుధారాణి, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 14 March, 2009
|