ఓటర్ నమోదుకు భారీ స్పందన
(వేముల సదానందం)
వరంగల్ : ఓటర్ల నమోదు, సవరణకు జిల్లాలో అనూహ్యంగా స్పందన వచ్చింది. 18 ఏళ్ళు నిండి ఓటు హక్కు లేని వారి కోసం ఆదివారం నాడు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వారీగా నిర్వహించిన ఓటర్ల నమోదులో 17 వేల మంది ఫారం 6 ను అందజేశారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో ఈ సంఖ్య అధికంగా ఉంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 3122 మంది, తూర్పులో 5238 మంది కొత్తగా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణకు గాను వివిధ పార్టీల ఏజెంట్లను కూడా అధికారులు ఆహ్వానించారు.
వారం రోజుల్లో దరఖాస్తుల పరిశీలన :
జిల్లా వ్యాప్తంగా వచ్చిన 16,908 దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిశీలించి అర్హులందరికీ ఓటుహక్కు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా దరఖాస్తులు రావడం రాష్ట్రంలో ఇతర జిల్లాలను పోలిస్తే వరంగల్ లోనే అధికం అన్నారు. గతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తిరస్కరణకు గురైన వారు తిరిగి దరఖాస్తు చేసుకున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. తాను కూడా ఓటర్ల నమోదు కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.
News Posted: 17 March, 2009
|