ఓటర్లకు టోల్ ఫ్రీ సమాచారం
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లా ఓటర్ల వివరాలు అందించేందుకు జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా టోల్ ప్రీ టెలిఫోన్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులతో ఆయన సోమవారంనాడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జె.సి. వి.కరుణ, డిఆర్ఓ శ్రీరాంరెడ్డి హాజరయ్యారు.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించడంతో పాటు వారిని నిర్భయంగా ఓటు వేసేలా చేయాలన్నదే తమ ఉద్దేశమని కలెక్టర్ వివరించారు. ఈ ప్రక్రియలో ఓటర్లు తమ ఓటుకు సంబంధించిన వివరాలు, పోలింగ్ కేంద్రాలు ఇతర వివరాలను ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఓటరుకూ గుర్తింపు కార్డును జారీ చేశామన్నారు. ఎన్నికల పరిశీలకులు జిల్లాలో త్వరలోనే పర్యటించే అవకాశం ఉన్నందున నియోజకవర్గాల వారీగా మ్యాపులు, గణాంకాలతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల నియమావళి అతిక్రమణపై వచ్చిన వార్తలపై సంబంధిత అధికారుల నుంచి వెంటనే నివేదికలు తెప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ పరిపానాధికారి చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
News Posted: 17 March, 2009
|