'ఎన్నికల'పై కలెక్టర్ సమీక్ష
(వేముల సదానందం)
వరంగల్ : ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు గ్రామీణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో ఆయన బుధవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రతి గ్రామంలోనూ గ్రామ కార్యదర్శి, విఆర్వో, అంగన్ వాడి కార్యకర్త, ఆశ కార్యకర్తలతో పాటు గ్రామంలోని ఇద్దరు ప్రముఖుల సెలఫోన్, ల్యాండ్ ఫోన్ నెంబర్లను సేకరించి ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సందర్భంగా కాని, దానికి ముందు గాని ఏదైనా గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తితే అక్కడి పరిస్థితులు వెంటనే తెలుసుకొని వేగంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఈ సమాచార వ్యవస్థ తోడ్పడుతుందని అన్నారు.
జిల్లాలో మార్చి 15న నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 10 వేలకు పైగా కొత్త దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటినీ రెండు మూడు రోజుల్లోగా విచారించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని జాయింట్ కలెక్టర్ కరుణ సూచించారు. అయితే, విఆర్వోలను మండలాల నుంచి కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల దరఖాస్తులను విచారించేందుకు ప్రత్యేకంగా నియమించాలని జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఓటరు గుర్తింపుకార్డులను వేగంగా పంపిణీ చేయాలని సూచించామన్నారు.
పోలింగ్ సిబ్బందికి ఫారం -12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ లను మొదటి విడత శిక్షణ సందర్భంగా తిరిగి స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కేంద్ర పరిశీలకులు త్వరలోనే వస్తున్నదని నియోకవర్గాల వివరాలు పొందుపర్చిన ప్రొఫైళ్ళు తయారు చేయాలని, పరిశీలనకు కావాల్సి వాహనాలను సమకూర్చుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఈ సెల్ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ వి. కరుణ, డిఆర్వో శ్రీరాంరెడ్డి, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
News Posted: 19 March, 2009
|