ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు
(వేముల సదానందం)
వరంగల్ : త్వరలో జరగున్న సాధారణ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఉపయోగం, పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు భారత ఎన్నికల సంఘం రిటైర్డ్ కార్యదర్శి, ఎన్నికల నిర్వహణలో అనుభవశాలైన చావలి రామబ్రహ్మం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. బి.జనార్థన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వి.కరుణ, డిఆర్ఓ శ్రీరాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్నందున పోలింగ్ కేంద్రాలలో రెండు ఓటింగ్ మిషన్లుంటాయని, ఈ రెండు మిషన్లను గుర్తించేందుకు లోక్ సభ ఓటింగ్ యంత్రానికి తెలురు రంగు సీలును, అసెంబ్లీ ఓటింగ్ యంత్రానికి పింక్ రంగు సీలు వేయడం జరుగుతుందని రామబ్రహ్మం తెలిపారు. ఓటును వినియోగించుకునే ఓటరుకు గుర్తింపుగా ఇంకు చుక్కకు బదులుగా ఇంకు నిలువు గీతగా పెట్టాలని ఎన్నికల సంఘం కొత్తగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలి, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధులు తదతర విషయాలను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా ఆయన వివరించారు.
News Posted: 23 March, 2009
|