ప్రకటనలపై కలెక్టర్ ఆంక్షలు
(వేముల సదానందం)
వరంగల్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రభుత్వ నిధులతో పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు ఏవిధమైన ప్రకటనలను జారీ చేయకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.బి.జనార్ధన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ను జిల్లాలో పకడ్బందిగా అమలు చేస్తున్నందున ప్రభుత్వ నిధులతో ప్రకటనలివ్వడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు కొన్ని దిన పత్రికల్లో వివిధ కార్యాలయాల తరఫున ప్రకటనలు జారీ చేయడం పట్ల కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ప్రకటనలు జారీ చేసిన జిల్లా పరిషత్ సి.ఇ.వో.కు మొగుళ్లపల్లి, చిట్యాల మండల పరిషత్ అధికారులకు, నర్సంపేట గ్రామ పంచాయితీ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏ విధమైన అధికారిక ప్రకటనలు జారీ చేసినా కలెక్టర్ గా తన ఫోటోను ప్రచురించరాదని గతంలోనే ఆదేశాలు జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు.
ప్రకటన జారీ చేయలేదు: సి.ఇ.వో
జిల్లా పరిషత్ తరఫున ఒక దినపత్రికలో ప్రచురితమైన ప్రకటన తాము జారీ చేయలేదని జిల్లా పరిషత్ సి.ఇ.వో డా.సుధాకర్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జెడ్పి నుండి ఏ విధమైన ప్రకటనలు జారీ చేయడం లేదని, ఆ ప్రకటనను తాము విడుదల చేయనందున ఎట్టి పరిస్థితుల్లోను ప్రకటనకు డబ్బులు చెల్లించే ప్రశ్న లేదని సి.ఇ.వో.జిల్లా ఎన్నిల అధికారికి రాసిన లేఖలో తెలిపారు.
News Posted: 25 March, 2009
|