విరోదాలను పారద్రోలండి: కలెక్టర్
( వేముల సదానందం)
వరంగల్ : జిల్లా సాంస్కృతిక మండలి, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేయి స్థంబాల దేవాలయంలో నిర్వహించిన విరోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి పాల్గొని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్గతంగా ఉన్న అసూయా, ద్వేషం, కోపం తదితర చెడు లక్షణాలను పూర్తిగా తొలగించినప్పుడే ప్రతి ఒక్కరిలోనూ ఈ విరోధి నామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి జిల్లా పాలనా యంత్రాంగం చేస్తున్న కృషికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్.పి. విశ్వనాథ్ చెన్నప్పు సజ్జనార్ మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విరోధి నామ సంవత్సరం జిల్లా ప్రజల్లో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. ఈ వేడుకల్లో జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.వెంకటరమణ, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ రాజేశ్వర్, వేయి స్థంబాల దేవాలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారావు, ప్రధాన అర్యకులు గంగు ఉపేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 28 March, 2009
|