ప్రిసైడింగ్ లో మెళకువలు
(వేముల సదానందం)
వరంగల్ : పోలింగ్ సమయానికి అయిదు నిముషాల ముందు ఓటు వేసేందుకు ఎంత మంతి వచ్చినా, వారిచే ఓటు వేయించే బాధ్యత ప్రిసైడింగ్ మరియు సహాయ ప్రిసైడింగ్ అధికాలపై ఉన్నదని కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి అన్నారు. వరంగల్ తహసిల్దారు కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికులకు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు జరిగిన శిక్షణా తరగతులలో జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ముగిసే దశలో ఎంత మంది ఓటర్లు వచ్చినా వారిందరికీ చీటీలిచ్చి పోలింగ్ బూత్ ఆవరణలో వుంచి వారందరిచే ఓటు వేయించాలని అన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కండిషన్ లో ఉండేలా చూసుకోవాలనీ, వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఇ.వి.యం.చూపించి తదుపరి పోలింగ్ ను ప్రారంభించాలని అన్నారు. ఓటర్ల జాబితాలో ఓట్లు వేసిన వారి నమోదు, ఇ.వి.యంకు సరి పోవాలని లేని యెడల మీరే తగు చర్యకు బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. ఓటరు గుర్తింపు కార్డుతో వచ్చిన వ్యక్తి సరిపోల్చుకోవాలని, ఓటు వేసిన వ్యక్తి గతంలో వేలి మీద చుక్క పెట్టేవారని, ఇప్పుడు గీత పెట్టాలన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఎన్నికలు విజయవంతంగా జరుగటకు వివిధ శాఖల నుండి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అంబేద్కర్, వరంగల్ తహసిల్థార్ భాస్కర్, మున్సిపల్ కమీషనర్ శివకోటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 30 March, 2009
|