కో-ఆర్డినేటర్ తొలగింపు
(వేముల సదానందం)
వరంగల్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్దంగా స్వయం సహాయక బృందాల మహిళా సమావేశం ఏర్పాటు, ఈ సమావేశానికి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడిని ఆహ్వానించినందుకుగాను ఇందిరా క్రాంతి పథం ఇంచార్జి ఏరియా కో-ఆర్డినేటర్, సి.సి.గా ఉన్న సి.హెచ్.నాగేశ్వరరావును విధులలో నుండి తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి చెప్పారు. కొత్తగూడ మండలం ఇంచార్జి ఏరియా కో-ఆర్డినేటర్ గా ఉన్న సి.హెచ్.నాగేశ్వరరావు తన కూతురు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 24న కొత్తగూడ మండలానికి చెందిన 400 మంది డ్వాక్రా మహిళలను 40 జీపుల ద్వారా నర్సంపేటలోని వి.ఆర్.గార్డెన్ కు తరలించారని చెప్పారు. ఈ సమావేశానికి ఒక ప్రధాన పార్టీ అభ్యర్థిని ఆహ్వానించి రాజకీయ ఉపన్యాసాలు చేయించారని వచ్చిన వార్తలపై విచారణకు ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ విచారణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని రుజువైనందున సి.హెచ్.నాగేశ్వరరావును విధుల నుండి తొలగించాల్సిందిగా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. కాగా సామాజిక భద్రత ఫించన్లను ఏప్రిల్ నెల ఒకటో తేదీననే పంపిణి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో సిబ్బంది ఉన్నందున ఈ పంపిణీ స్వల్పంగా ఆలసయమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఫించన్ల పంపిణీ సందర్బంగా రాజకీయ నాయకులను, నాన్ అఫీషియల్స్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆహ్వానించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.
News Posted: 30 March, 2009
|