టాస్క్ ఫోర్స్ కు కలెక్టర్ ఆదేశం
(వేముల సదానందం)
వరంగల్ : లైసెన్స్ లేకుండా మద్యం అమ్మకాలు లేవని, అక్రమంగా సారాయి తయారు చేయడం లేదని లిఖిత పూర్వకంగా తెలియచేయాలని గ్రామస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలకు కలెక్టర్ బి.జనార్థ్ రెడ్డి లేఖలు జారీ చేశారు. అమ్మకందారులపై కేసుల బనాయింపులు, ఎక్సైజ్ అధికారుల ముమ్మర తనిఖీల వల్ల వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లా పాలనా యంత్రాంగం అత్యంత పటిష్ఠంగా అమలు చేస్తుండడంతో గ్రామాల్లో బెల్టుషాపులుగా పిలిచే అనధికార అమ్మకాలకు పుల్ స్టాఫ్ పడింది. గత సంవత్సరం మార్చి 16వ తేదీనుండి నెలాఖరవు వరకు జరిన మద్యం అమ్మకాలు, ఈ సంవత్సరం ఇదే నెలలో జరిగిన అమ్మకాలను పోల్చి చూస్తే మద్యం అమ్మకాలలో 7 శాతం తగ్గుతల కనిపించింది. అదే విధంగా అక్రమంగా మద్యం అమ్ముతున్న 215 మందిపై కేసులు నమోదు చేసి 196 లీటర్ల మద్యాన్ని, 120 లీటర్ల బీరును స్వాధీన పర్చుకున్నారు. అలానే అధిక ధరలకు మద్యం అమ్ముతున్న ఆరు వైన్ షాపులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ లోని సభ్యులైన గ్రామ కార్యదర్శి, వి.ఆర్.ఓ, పోలీసు కానిస్టేబుల్ లు స్వయంగా సంతకం చేసి పత్రాన్ని జిల్లా ఎన్నికల కార్యాలయానికి అందచేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
News Posted: 4 April, 2009
|