అభ్యర్థులకు కలెక్టర్ సూచన
(వేముల సదానందం)
వరంగల్ : పార్లమెంటు, శాసనసభలకు ఈనెల 16న జరుగనున్న సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ బి.జనార్థన్ రెడ్డి సూచించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ కు ఎటువంటి ఆటంకం లేకుండా ముందు అనుమతితో ఊరేగింపులు జరుపుకోవాలని, ఈ సమయంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రాంతంలో రెండు పార్టీలు ఒకే సమయంలో ర్యాలీ నిర్వహించదలిస్తే ముందు వచ్చిన వారికే అనుమతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
మైక్ ల ఏర్పాటుకు జిల్లా ఎస్పీ నుండి అనుమతి పొందాలని, ఆ అనుమతి పొందినం పత్రాలను ర్యాలీలో ఉపయోగించే వాహనాలలో వుంచుకోవాలని కలెక్టరు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటలక వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి నివ్వడం జరుగుతుందన్నారు. ఎంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి అయినా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించాలంచే ఎన్నికల సంఘం అనుమతి పత్రం తప్పనిసరి అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద సభలకు అనుమతి ఇవ్వడం జరగదని చెప్పారు.
పోలింగ్ సందర్బంగా వివిధ పార్టీలు ఏర్పాటు చేసుకొనే ఏజెంట్లపై ఎటువంటి కేస్ లేకుండా జాగ్రత్తలు తీసుకొని, మూడు రోజులు వారి పేర్లను ఇవ్వాలని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా ఉందనీ, ఇదే విధంగా ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.కరుణ, జిల్లా ఎస్పి.సజ్జనార్, బిజెపి తరపున జైపాల్, బిఎస్ పి నుండి లాలయ్య, పిఆర్పి నుండి డా.రాజమౌళి, ఎం.సి.పి.ఐ.నుండి వీరమల్లు, వివిధ స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.
News Posted: 4 April, 2009
|