జిల్లాలో కాంగ్రెస్ జయభేరి
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. రెండు లోక్ సభ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి సంచలనం సృష్టించారు. మిగతా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు తెలుగుదేశం, ఒకటి తెరాస గెలుచుకున్నాయి. మహాకూటమి వ్యూహం జిల్లాలో ఘోరంగా బూమరాంగ్ అయింది. ఇక ప్రజారాజ్యం పార్టీ జిల్లాలో సోదిలోకి కూడా రాకుండా పోయింది.
జిల్లాలోని వరంగల్ ఎస్సీ రిజర్వుడు లోక్ సభా నియోజకవర్గంలో సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ ఎస్టీ స్థానంలో బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన విజయాలు సాధించారు. జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్టేషన్ ఘన్ పూర్ (ఎస్సీ), జనగామ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గండ్ర వెంకట రమణారెడ్డి, కొండా సురేఖ, బస్వరాజు సారయ్య, కొండేటి శ్రీధర్, కవిత, తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య విజయాలు సాధించారు. పొన్నాల లక్ష్మయ్య కేవలం 44 ఓట్ల మెజార్టీతో తన స్థానాన్ని దక్కించుకోగా కొండా సురేఖ, బస్వరాజు సారయ్య హ్యాట్రిక్ సాధించారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువాత రాజకీయ ముఖచిత్రంపై ఏర్పడిన భూపాలపల్లిలో డిసిసి అధ్యక్షుడు గండ్ర వెంకట రమణారెడ్డి బోణీ కొట్టారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన చేర్యాల ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరాజితులు కావడం విశేషం. డోర్నకల్ జనరల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నాలుగుసార్లు విజయం సాధించిన మంత్రి డి.ఎస్.రెడ్యా నాయక్ ఈ సారి ఓడిపోయారు. డోర్నకల్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన డిఎస్ రెడ్యా మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఇతరులకు అవకాశం ఇవ్వకుండా తన కూతురికే కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించడంతో ఆయనపై వ్యతిరేకత వచ్చినట్లైంది. రెడ్యా ఓడిపోయినా ఆయన కుమార్తె కవిత మాత్రం విజయం సాధించడం కొంత ఊరటనిచ్చే విషయం.
స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు విజయావకాశాలు మెరుగయ్యాయి. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ప్రత్యర్థి పార్టీల నుంచి ముగ్గురు స్థానికేతర అభ్యర్థులు కావడంతో స్థానికుడైన కొండేటి శ్రీధర్ కు కలిసివచ్చినట్లైంది.
ఇదిలా ఉండగా నర్సంపేట, డోర్నకల్, పాలకుర్తి, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు రేవూరి ప్రకాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ధనసరి అనసూయ గెలిచారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి దాస్యం వినయ భాస్కర్ విజయం సాధించగా ఒక్క స్థానాన్ని కోల్పోయింది. జిల్లాలో తెరాస ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా కేవలం ఒక్క స్థానమే దక్కించుకోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. తెరాసతో ఏర్పడిన పొత్తు టిడిపికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మహాకూటమి హామీలు ఆకట్టుకున్నా తెరాస సరైన అభ్యర్థులను రంగంలో దింపడంలో విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి.
News Posted: 16 May, 2009
|