'తెరాస ఓటమి స్వయంకృతం'
వరంగల్ : ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు స్వయంకృతమని మందాడి సత్యనారాయణరెడ్డి దుయ్యబట్టారు. అసలు కేసీఆర్ లో ఉద్యమ స్ఫూర్తే లేదని, కేవలం స్వార్ధంతో నిండిన ఆయన తన కుటుంబానికి, స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆరోపించారు. తెరాస నాయకుడు దిలీప్ కుమార్ తో కలిసి మందాడి గురువారంనాడు ఓ ప్రైవేట్ చానల్ లో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధించాలన్న కమిట్ మెంటే అసలు కేసీఆర్ లో లేదని మందాడి విమర్శించారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణను సాధించడం సాధ్యమన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెరాస పార్టీని ఇప్పటికైనా ఉద్యమ సంస్థగా మార్చాలని మందాడి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తెరాస కార్యకర్తలను పక్కన పెట్టిన కేసీఆర్ కుటుంబ సభ్యులకే టిక్కెట్లు కేటాయించడమేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ సొంత జాగీరుగా మార్చేశారని ఆయన దుయ్యబట్టారు.
News Posted: 21 May, 2009
|