పటేల్ కు రీ పోస్ట్ మార్టం
వరంగల్ : పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సిపిఐ (ఎమ్మెల్యే) మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు పటేల్ సుధాకర్ రెడ్డి మృత దేహానికి వరంగల్ ఎమ్.జి.ఎమ్.లో సోమవారం రెంవడసారి రీ-పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున తాడ్వాయ్ మండలం లవ్వల అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ మోస్ట్ వాన్టెడ్ అగ్రనాయకుడు పటేల్ సుధాకర్ రెడ్డి (51) తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటయ్య (29)లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే మృత దేహాలకు ఎతురునగరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించడంతో పటేల్ సుధాకర్ రెడ్డి మృత దేహానికి రీ-పోస్ట్ మార్టం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లవ్వల ఎదురు కాల్పుల సంఘటనలో మృతి చెందిన ఇద్దరిలో ఒక పటేల్ సుధాకర్ రెడ్డి మృత దేహానికి సోమవారం వరంగల్ జిల్లా ఎమ్.జి.ఎమ్.లో ఫోరెనిక్స్ వైద్యుల చేత రీ-పోస్ట్ మార్టం నిర్వహించారు. రీ-పోస్ట్ మార్టం సందర్భంగా ఎస్పీ సజ్జనార్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రీ-పోస్ట్ మార్టం సమయంలో రక్తసంబంధీకులను ఎవరినీ అనుమతించలేదని సోదరులు ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డిలు ఆరోపించారు. మృతుడు సుధాకర్ రెడ్డి భార్య వనజ రీ-పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని స్వగృహానికి తీసుకువెళ్ళారు. పటేల్ సుధాకర్ రెడ్డి మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన సోదరులు తెలిపారు. పటేల్ సుధాకర్ రెడ్డితో ఎన్ కౌంటర్లో మృతి చెందిన వెంకటయ్య శవాన్ని ఆదివారమే బంధువులు తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు.
News Posted: 25 May, 2009
|