మావోలకు ఎస్పీ పిలుపు
(వేముల సదానందం)
వరంగల్ : అజ్ఞాతంగా పనిచేస్తున్న నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని వరంగల్ జిల్లా ఎస్పీ వి.సి.సజ్జనార్ పిలుపునిచ్చారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అనుమాండ్ల రాజయ్యతో సహా ఏడుగురు మావోలు మంగళవారం ఎస్పీ సజ్జనార్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూటకపు సిద్ధాంతాలను పట్టుకొని వేళాడుతున్న మావోలు తల్లీ, తండ్రి, కుటుంబసభ్యులను వదిలిపెట్టి అజ్ఞాతంగా సాధించేది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎంత పెద్ద హోదాలో ఉన్న మావోలైనా లొంగుబాటు విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా జనస్రవంతిలో కలిసేందుకు ప్రయత్నించాలన్నారు. మీడియా ప్రతినిధుల సహకారంతో నక్సలైట్లు లొంగిపోయినా అభ్యంతరం లేదని ఎస్పీ చెప్పారు.
లొంగిపోతే పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారని, చిత్రహింసలకు గురి చేస్తారని నక్సల్స్ నాయకులు భయపెడుతుంటారని అది వాస్తవం కాదని ఎస్పీ సజ్జనార్ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న ఈ తరుణంలో కాలం చెల్లిన సిద్ధాంతాలకు విలువనిస్తూ అజ్ఞాతంగా గడుపుతున్నవారు వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ఈ సమావేశంలో పరిపాలనా విభాగం ఎస్పీ రమేష్ నాయుడు పాల్గొన్నారు. మావోయిస్టు అగ్రనేత పటేల్ సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటయ్యలు లవ్వాల అటవీప్రాంతంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వారం రోజుల వ్యవధిలోనే ఏడుగురు మావోలు ఎస్పీ సజ్జనార్ ఎదుట లొంగిపోవడం గమనార్హం.
News Posted: 2 June, 2009
|