కార్యకర్తలకే అధికారం: పొన్నాల
(వేముల సదానందం)
వరంగల్ : కాంగ్రెస్ పార్టీకి శ్వాస లాంటి కార్యకర్తలకు అధికారాన్నివికేంద్రీకరించే విధంగా కృషిచేస్తానని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. వరుసగా రెండోసారి కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా మంగళవారంనాడు వరంగల్ జిల్లాకు వచ్చారు. యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సందర్భంగా మంత్రి పొన్నాల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలో మళ్ళీ మంత్రి పదవి దక్కడంతో తన జన్మ ధన్యమైందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరుగుతున్నదని, అందుకే రాష్ట్ర ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించారన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత వాగ్దానాలను ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు విశ్వసించలేదన్నారు. అందువల్లే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపెట్టారని పొన్నాల పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సాగునీటిని అందించేందుకు కంతానపల్లి, దేవాదుల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ పనులు చేపట్టినట్లు పొన్నాల వివరించారు. జిల్లాలో విద్యుత్ లో ఓల్టేజి సమస్య పరిష్కారానికి జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టును చెల్పూరు వద్ద చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉందన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ప్రతిపక్షాలు ఊపిరి పీల్చుకోని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కార్యకర్తల బాగోగులు చూడాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్కొండ ఎక్స్ ప్రెస్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఖాజీపేట రైల్వేస్టేషన్ లో దిగిన పొన్నాల లక్ష్మయ్యకు అఖండ స్వాగతం లభించింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు ఆందంతో బాణసంచా కాల్చి నృత్యాలు చేశారు. పొన్నాల సన్మాన కార్యక్రమంలో నగర మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, స్టేషన్ ఘన్ పూర్, వర్దన్నపేట ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, కొండేటి శ్రీధర్, గ్రంథాయలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్ రెడ్డి, జెడ్ పి చైర్ పర్సన్ లక్డావతి ధనవంతి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 2 June, 2009
|