తుపాకులతో 12 మంది అరెస్ట్
(వేముల సదానందం)
వరంగల్ : లష్కరే-ఇ-తోయిబా మత చాందసవాదులు దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూర్, చెన్నై మహానగరాలలో విద్వంశాలు సృష్టించే అవకాలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా పోలీసులు అన్ని చోట్లా తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా గత రాత్రి జనగామా రైల్వే స్టేషన్ లో ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్నఏపీ ఎక్స్ ప్రెస్ లో పోలీసులు జనరల్ బోగీలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన చంద్ర ప్రకాష్ తివారి, రఘువీర్ సింగ్, గోవింద్ సింగ్, సురేంద్ర సింగ్, రాకేష్ సింగ్, రవీంద్ర సింగ్, జయకరణ్ సింగ్, ధర్మేంద్ర సింగ్, రాజేష్ సింగ్, కరణ్ సింగ్, రణ్ బీర్ సింగ్, ప్రదీప్ కుమార్ సింగ్ లను అనుమానస్పద రీతిలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 12 తుపాకులు దొరికాయన్నారు. అందులో 7 సింగిల్ బ్యారెల్ గన్స్ కాగా, 3 డబుల్ బ్యారెల్ గన్స్. 0.32 రెండు రివాల్వర్లు, 150 వరకు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 25-50 ఏళ్ళలోపు వాళ్ళే. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా, పురాంకు, ముర్ర గ్రామాలకు చెందిన వారుగా గుర్తించినట్లు వరంగల్ జిల్లా ఎస్పీ వి.సి.సజ్జనార్ విలేఖరుల సమావేశంలో వివరించారు.
ఆయుధాలతో దొరికిన ఈ పన్నెండు మందీ సెక్యూరిటీ గార్డుల పేరుతో హైదరాబాద్ వస్తున్నట్లుచెప్పారన్నారు. రికార్డులు పరిశీలించగా కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ నుండి పొందిన గన్ లైసెన్స్ లలో పంటపొలాల రక్షణ నిమిత్తం ఉందనీ, అయితే పంట పొటలాల కోతలు ముగియగానే తుపాకులను డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆయుధాల చట్టం 1959 సంవత్సరం 20, 25 1B సెక్షన్ ప్రకారం ఒక ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు ఆయుధాలను తరలించకూడదన్నారు. కాగా దీనిపై పూర్తిగా విచారచ జరపడానికి ఒక పోలీసు బృందాన్ని కాన్పూర్ కు పంపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు.
News Posted: 5 June, 2009
|